రిజిస్టర్‌ చేసుకున్న వారికే వ్యాక్సిన్‌ :వైద్యశాఖ

రాష్ట్రంలో ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలిచ్చే కార్యక్రమం ప్రారంభమైంది. అప్పుడు టీకా తీసుకునేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో కొవిన్‌లో రిజిస్టర్‌ చేసుకోకపోయినా, కేంద్రాలకు నేరుగా వచ్చి వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. సెకండ్‌ వేవ్‌ తీవ్రతతో వ్యాక్సిన్ల కోసం ప్రజలు బారులు తీరడంతో ప్రస్తుతం టీకాలకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. మరోవైపు ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. దీంతో రిజిస్టర్‌ చేసుకున్న వారికే వ్యాక్సిన్‌ ఇస్తామని వైద్యశాఖ స్పష్టం చేసింది. ఇక రెండో డోసుకు కూడా స్లాట్‌ బుకింగ్‌ను తప్పనిసరి చేసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులకు ఇది ఇబ్బందికరంగా మారింది. మరోవైపు రెండో డోసు కోసం స్లాట్‌ బుక్‌ చేసుకుందామంటే సోమవారం ఉదయం వరకు ‘‘టీకా కేంద్రాలు అందుబాటులో లేవు’’ అని కొవిన్‌ పోర్టల్‌లో చూపింది. దీనిపై సోమవారం వైద్య ఆరోగ్యశాఖకు పెద్దయెత్తున ఫిర్యాదులు రావడంతో వెంటనే కేంద్రాల వివరాలను అప్‌లోడ్‌ చేశారు. సాయంత్రానికి రెండో డోసు స్లాట్లు బుక్‌ చేసుకునేందుకు వీలు కలిగింది. అయితే స్లాట్లన్నీ తొలి డోసు వారే బుక్‌ చేసుకుంటే రెండో డోసు వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నెల చివరి నాటికి 11 లక్షల మందికి రెండో డోసు వేయాల్సి ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే చాలా మంది రెండో డోసు కోసం ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారికి ప్రాధాన్యమివ్వాలని, అవసరమైతే ప్రత్యేకంగా ఒకట్రెండు రోజులు కేటాయించాలని వైద్య శాఖ నిర్ణయించింది.

coroknas

టీకా నిల్వలు తక్కువగా ఉండడం, కేంద్రం నుంచి వచ్చే డోసులు సరిపడా లేకపోవడంతో వైద్య ఆరోగ్యశాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వ్యాక్సిన్‌ కేంద్రా ల్లో రోజుకు 100 మందికే టీకా ఇవ్వనుంది. అది కూడా స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలకు రాష్ట్రానికి కేంద్రం కేవలం 8.35 లక్షల డోసులే పంపుతామని సమాచారం ఇచ్చింది. సరిగ్గా వేస్తే అవి మూడు రోజులకే సరిపోతాయి. కేంద్రం ఈ డోసులను ఒకేసారి పంపదు. ఒకవేళ రోజూవారీ వేసినా మే నెలకు కేటాయించిన డోసుల ప్రకారం రోజుకు 27833 టీకాలే వేయవచ్చు. ఈ నెలంతా అర్హులందరూ టీకా కోసం రిజిష్ట్రేషన్‌ చేసుకోవచ్చని వైద్యశాఖ వెల్లడించింది.