ఓ పోలీస్ కానిస్టేబుల్ తాను కన్నుమూసినా.. ఐదుగురు కుటుంబాల కళ్లల్లో వెలుగులు నింపారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఆ కానిస్టేబుల్ అవయవదానం వల్ల ఐదుగురికి పునర్జన్మ దక్కింది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ విభాగానికి చెందిన 12వ బెటాలియన్‌లో బత్తుల విజయ్ కుమార్ (32) విధులు నిర్వహిస్తున్నారు. విజయ్ కుమార్ బైక్‌పై వస్తుండగా.. రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విజయ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం మలక్ పేటలో ఉన్న యశోద ఆస్పత్రికి తరలించారు.
ఐసీయూలో చికిత్స పొందిన విజయ్ కుమార్ ను.. మంగళవారం న్యూరో ఫిజిషియన్లు పరీక్షించారు. వైద్య పరీక్షల్లో అతను బ్రెయిన్ డెడ్ కు గురైనట్లు తెలిపారు. విజయ్ కుమార్ బ్రెయిడ్ డెడ్ అనే వార్త తెలియగానే కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అంత బాధలో ఉన్నాకూడా ఆ కుటుంబం ఓ గొప్ప పనిచేయడానికి పూనుకున్నారు. బ్రెయిన్ డెడ్ కావడంతో ఆయన అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. విజయ్ కుమార్ మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులను సేకరించి, గుండెను అపోలో ఆస్పత్రికి పంపించారు. తాము సేకరించిన గుండెను బుధవారం ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల మధ్య గ్రీన్ ఛానెల్ ద్వారా మలక్ పేట యశోద ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్‌కు తరలించారు.
ఇది చదవండి: Tamil Nadu: కూతురు కోసం 30 ఏళ్లుగా మగాడి వేషధారణలో తల్లి!
విజయ్ కుమార్ నుంచి సేకరించిన మిగిలిన అవయవాలను అవసరమైన పేషంట్లకు అమర్చనున్నట్లు యశోద వైద్యులు వెల్లడించారు. ఇతరులకు తోచినంత సాయం చేయాలనే విజయ్ కుమార్ ఆశయాలకు జీవం పోయాలనే ఉద్దేశంతోనే అవయవదానం చేసేందుకు నిర్ణయించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. బ్రెయిన్ డెడ్ అయిన విజయ్ కుమార్ అవయవదానంతో చిరంజీవుడయ్యాడు. మరణానంతరం కూడా ఐదు కుటుంబాల్లో వెలుగులు నింపిన కానిస్టేబుల్ విజయ్ కుమార్ కి సహచర ఉద్యోగుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. జయహో కానిస్టేబుల్ విజయ్ కుమార్ అంటూ అంతిమ యాత్రలో నినాదాలు మార్మోగాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.