పరువునష్టం కేసులో తెలంగాణ గవర్నర్ తమిళిసైకి ఊరట..!

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఆమెపై దాఖలైన పరువునష్టం కేసును ధర్మాసనం నిన్న కొట్టేసింది. తమిళిసై 2017లో బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్‌ కట్టపంచాయత్తు (దాదాగిరి) చేస్తున్నారంటూ మీడియాలో వ్యాఖ్యానించారు.

tamilasai minవీసీకే పార్టీ ప్రజల భూములను ఆక్రమించుకుంటోందని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఆ పార్టీకి చెందిన నాయకుడు కార్తికేయన్‌ కాంచీపురంలోని జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో తమిళిసైపై ప్రైవేటు కేసు పెట్టారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు సౌందరరాజన్‌కు సమన్లు జారీ చేసింది. తనపై కేసును కొట్టేయాలని కోరుతూ ఆమె మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.

కాగా, ఈ కేసు విచారణలో భాగంగా న్యాయమూర్తి జస్టిస్‌ దండపాణి మాట్లాడుతూ… వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నప్పటికీ వాటికి పరిమితులు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తమిళిసైపై నమోదైన కేసును కొట్టివేసింది.