పెట్రోల్ ధరల పెంపుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి KTR!

KTR about petrol increase rates

దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుతం విశాఖలో లీటర్ పెట్రోల్‌ రూ.120.81, డీజిల్ రూ.106.40గా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49, డీజిల్ ధర రూ.105.49 గా కొనసాగుతున్నాయి. దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ రూ.105.41, డీజిల్ రూ.96.67గా ఉంది. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్‌ ధర 100కు పైమాటే. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత, ధరలు తగ్గించాలనే డిమాండ్లు మొదలయ్యాయి. బుధవారం ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గించాలని ప్రధాని కోరారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గించాలని కోరారు. కేంద్రం ఇప్పటికే ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించిందని గుర్తు చేశారు. ఎప్పటి నుంచో కేంద్రం చేస్తున్న ఈ వ్యాఖ్యలకు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కేటీఆర్‌ స్పందించారు.

ఇదీ చదవండి: TRS పార్టీపై హైకోర్టుకు K A పాల్!

రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గించుకోవాలని కేంద్రం చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ తనదైనశైలిలో స్పందించారు. ‘కేంద్రం ఎప్పుడూ రాష్ట్రాలను బద్నాం చేయాలని చూస్తుంటుంది. 2014లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 105 డాలర్లుగా ఉంది. ఆ సమయంలో లీటరు పెట్రోల్‌ ధర రూ.70. ఇప్పుడు బ్యారల్‌ క్రూడ్ ఆయిల్‌ ధర 105 డాలర్లుగానే ఉంది. మరెందుకు పెట్రోల్‌ లీటరు రూ.120కు చేరింది. 2014లో మేము అధికారంలోకి వచ్చిన సమయంలో వ్యాట్‌ 35 శాతం ఉంది. ఇప్పుడు వ్యాట్‌ 35 శాతంగానే ఉంది. మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క పర్సంట్‌ వ్యాట్‌ కూడా పెంచలేదు. మరెందుకు లీటరు పెట్రోల్‌ ధర రూ.50 పెరిగింది? సెస్‌ అని స్పెషల్‌ ట్యాక్స్‌ అని రేట్లు పెంచుకుంటూ పోయారు. సెస్‌ వల్ల రాష్ట్రానికి ఒక్క రూపాయి రాదు.’

‘ఇప్పుడు పెట్రోల్‌ పెరిగితే.. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల పెరిగాయి అంటున్నారు. యుద్ధం లేనప్పుడు ఆయిల్ ధరలు ఎందుకు పెరిగాయి? 2018లో ఎందుకు పెరిగింది? 2019లో ఎందుకు పెరిగింది? అని ప్రశ్నిస్తున్నాం. పైగా ఎదురు రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తుంటారు. సిగ్గులేకుండా ఎదురు వీళ్లే ధర్నాలు చేస్తారంట. ఏ సన్నాసి అయితే పెంచాడో.. ఆ సన్నాసే తగ్గించాలని మేమంటున్నాం. వీళ్లను ఎక్స్ పోజ్‌ చేయకపోతే ప్రజలు కూడా వీళ్ల మాటలు నమ్మే పరిస్థితి ఉంటుంది. 50 సార్లు ఒకే అబద్ధాన్ని చెబితే ప్రజలు కూడా అది నిజం అనుకునే పరిస్థితి ఉంటుంది.’ అంటూ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కేంద్రం వ్యాట్‌ తగ్గించాలని రాష్ట్రాలను కోరడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.