నాన్న బాధ తీర్చడానికి అద్భుత యంత్రాన్ని కనిపెట్టిన చిన్నారి ! సెల్యూట్ చేసిన కేటీఆర్

hydralic wheel chair

కంటే కూతురినే కనాలి అంటారు. ఆడ కూతురికి తల్లితండ్రుల మీద అంతటి ప్రేమ ఉంటుంది. ముఖ్యంగా కూతురికి నాన్న అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. వేలు పట్టి నడక నేర్పించే నాన్నే ఆమె మొదటి హీరో. అలాంటి తండ్రే నడవలేక ఓ కుర్చీకి పరిమితం అయిపోతే!  ఒళ్ళు హూనం చేసుకుని తన కోసం కష్టపడి పని చేసే నాన్న, ఒక్కసారిగా తన పని కూడా తానే చేసుకోలేని స్థితికి వచ్చేస్తే!  ఇలాంటి పరిస్థితిలో ఏ కూతురు హృదయం అయినా బరువెక్కిపోతుంది. తన సూపర్ హీరోని అలా చూడల్సి రావడం ఏ బిడ్డకైనా నరకమే. 9వ తరగతి చదువుతున్న బషీరాకి కూడా ఇలాంటి సమస్యే వచ్చింది. కానీ.., ఆ చిన్నారికి తండ్రి మీద ఉండే ప్రేమే ఓ అద్భుతం జరగడానికి కారణం అయ్యింది. అసలు తండ్రి కోసం బషీరా ఆవిష్కరించిన అద్భుతం ఏమిటి? కేటీఆర్ సైతం ఈ చిన్నారిని ఎందుకు మెచ్చుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

బషీరా వాళ్ళది నల్గొండలో ఓ మధ్యతరగతి కుటుంబం. ఆమె నాన్న కష్టంతోనే ఇల్లు గడిచేది. కానీ.., ఓ రోజు ఉదయాన్నే లేచి పనికెళ్లాల్సిన నాన్న కళ్లెదుట కోమాలో ఉన్నాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి వాళ్ళది. డాక్టర్లు పక్షవాతంగా తేల్చారు. ఆ వార్త విన్న బషీరా కుటుంబం నోట మాట రాలేదు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. ఇప్పుడు కుటుంబాన్ని సాకేదెవ్వరు? తమను ఆదుకునేదెవరు అన్నదే వారి మదిలో మెదిలిన మొదటి ప్రశ్న. భర్తను కాపాడుకునేందుకు ఆ భార్య పని బాట పట్టింది. కుటుంబ పోషణ.. భర్త బాధ్యత తీసుకుని ఆ కుటుంబానికి పెద్ద దిక్కైంది. కరోనా కాలంలో వారు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. చక్కగా నడవాల్సిన నాన్న చక్రాల కుర్చీకి పరిమిత మయ్యాడు. అమ్మ పని మానుకుంటే వారికి తిండి దొరకదు. నాన్నను చూసుకోవాలంటే ఆ చిన్నారి బషీరా బడి మానుకోవాల్సిందే. అలా ఆ అమ్మాయి ఒక ఏడాది చదవు కూడా మానుకొంది. తరువాత ఏడాది ఆమె స్కూల్ కి వెళ్లినా, బషీరా ఆలోచనలు అంతా తండ్రి గురించే. బషీరాకి కుటుంబ పోషణ ఎలా అన్నబాధ లేదు. తన భవిష్యత్ గురించి ఆలోచన లేదు. ఆమె మదిలో ఎప్పుడూ ఒకటే ఆలోచన తండ్రి పడే బాధకు ఏదైనా పరిష్కారం ఉందా? ఎవరిపై ఆధారపడకుండా తన కనీస అవసరాలను తీర్చుకోగలిగితే చాలు కదా అన్నదే ఆమె ఆలోచన. స్కూల్ లో కూడా నాన్న గురించే ఆలోచన. సరిగ్గా.. ఇలాంటి సమయంలో స్కూల్ లో వచ్చిన సైన్ ఫెస్ట్ బషీరా కష్టానికి ఉపాయాన్ని అందించింది.

hydralic wheel chairతండ్రి కోసం బషీరా సరికొత్త ఆవిష్కరణ:

తెలంగాణ స్టూడెంట్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌లో భాగంగా పాఠశాలలో ఉపాధ్యాయులు ఇచ్చిన అంశం ఆమెని ఆకర్షించింది. సమాజంలో మన చుట్టూ వందల సమస్యలు ఉంటాయి. కానీ.., ఒక్క ఆలోచనతో ఆ కష్టాలను తీర్చవచ్చు. మీ ప్రయోగం కూడా నిజ జీవితంలో మనుషులు పడే ఇబ్బందిని తొలగించేది అయ్యుండాలి. ఇదే ఉపాధ్యాయులు ఇచ్చిన అంశం. ఈ ఆలోచన బషీరాని బాగా ఆకర్షించింది. మా నాన్న పడుతున్న కష్టానికే పరిష్కారం కనుగొంటే బాగుంటుంది కదా అని బషీరా అనుకుంది. తామెవరూ లేకపోయినా.. కుర్చీలో ఉండే తన తండ్రి ఏ వస్తువునైనా తీసుకోగలిగేలా చేయాలనుకుంది. అంటే.. సాధారణంగా కుర్చీలో అటూ ఇటూ తిరుగుతున్న తండ్రికి కుర్చీ సాయంతో పైకి లేవగలిగేలా చేయాలనుకుంది. అలా.. కొన్ని నెలలు పాటు.. నిద్రలేని రాత్రులు గడిపి తన తండ్రి కోసం హైడ్రాలిక్ వీల్ చైర్ కనుగొంది బషీరా. ఈ వీల్ చైర్ సహాయంతో బషీరా తండ్రి తన పనులను తాను చేసుకోగలిగాడు. దీంతో., బషీరా ఆనందానికి హద్దే లేకుండా పోయింది.

దేశవ్యాప్తంగా అరుదైన గుర్తింపు

తెలంగాణ స్టూడెంట్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌కు రాష్ట్రం నుంచి 7,900 పైచిలుకు ఐడియాస్ పంపితే బషీరా చేసిన ఆవిష్కరణకు టాప్ 25లో చోటు దక్కింది. హైదరాబాద్ లో  నిర్వహించిన ఫినాలేలో బషీరా ఆవిష్కరణ చూసి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ఆశ్చర్యపోయారు. తన ఆలోచన ఎందరికో జీవితంపై ఆశను పెంచుతుందని కొనియాడారు. బషీరా కుటుంబ నేపథ్యం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని మాటిచ్చారు.తన తండ్రి కష్టంలో నుంచి పుట్టుకొచ్చిన బషీరా ఆలోచన వీల్ చైర్ లో కాలం వెళ్లదీస్తున్న ఎందరికో ఉపయోగకరంగా మారనుంది. ఇది.. ఆ కూతురికి తండ్రి మీద ఉన్న ప్రేమకి నిదర్శనం. మరి.. ఈ విషయంలో చిన్నారి బషీరాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.