దివ్యాంగురాలు అయినా దివ్యమైన కవితలు ఆమె సొంతం…

బూర రాజేశ్వరి అనేకంటే సిరిసిల్ల రాజేశ్వరి టక్కున గుర్తుకొస్తుంది అందరికీ. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన ఒక నిరుపేద చేనేత కార్మిక కుటుంబానికి చెందిన బూర అనసూయ, సాంబయ్య దంపతులకు 1980లో ఆమె జన్మించింది.  ఆమె పుట్టుకతోనే వికలాంగురాలు. చేతులు వంకర్లుపోయి పని చేయవు. మాటలు రావు. తల నిలబడదు. ఎప్పుడూ వణికిపోతుంటుంది. చేతులు సరిగా పని చేయకపోవడంతో పట్టుదలతో కాళ్లతోనే రాయడం నేర్చుకొని స్థానిక నెహ్రూనగర్ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివింది. సిరిసిల్ల అంటే నేతన్నలకు పుట్టినిల్లు లాంటిది. అక్కడ వారి మధ్య పెరిగిన రాజేశ్వరి వారి కష్టాలను కవితలుగా మలిచేది. కాళ్ళతోనే పెయింటింగ్ వేయడం కూడా నేర్చుకుంది. ఆమె గురించి తెలుసుకున్న కేటీఆర్ ఆమెను తెలంగాణ బోర్డు కూడా సిఫార్సు చేశారు. ఆమె రాసిన కవితలను ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గారు ప్రచురింప చేశారు. అమ్మ మీద, తెలంగాణ ఉద్యమం మీద, నేత కార్మికుల మీద, వరకట్న వేధింపుల మీద, స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలపై కవిత్వం రాసింది రాజేశ్వరి. 1999లో కలం పట్టిన రాజేశ్వరి ఇప్పటి వరకు 350కిపైగా కవితలు రాసింది. ప్రస్తుతం మహారాష్ట్ర బోర్డు అన్ని కాలేజీల్లోనూ ద్వితీయ భాష తెలుగు లో ఆమె కవితల పాఠ్యాంశాలుగా చేర్చి బోధిస్తున్నారు. కేటీఆర్ కూడా ఆమె కవితలను తెలంగాణ బోర్డు లో చేర్చాలని ఆమె గురించి పాఠ్యాంశాల్లో పొందుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంత గొప్ప స్థాయికి చేరుకున్న సిరిసిల్ల రాజేశ్వరి జీవితంలో ఎన్నో కష్టాలను, ఎన్నో ఒడిదుడుకులను, అవమానాలను ఎదుర్కొని వాటన్నింటినీ జయించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. వైకల్యాన్ని లెక్కచేయకుండా రచనలు చేస్తున్న రాజేశ్వరిని గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాజేశ్వరికి ప్రతినెలా రూ.10 వేలు పెన్షన్ అందేలా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.

Untitled designpoet1554986452713

 

రూ.10 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా వచ్చిన వడ్డీ సొమ్మును రాజేశ్వరికి పెన్షన్‌గా అందజేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయంలో జనవరి 11 2015 న రూ.10లక్షల ఫిక్స్‌డ్‌ టర్మ్‌ డిపాజిట్‌ పత్రాన్ని రాజేశ్వరికి అందజేశారు. ఈ డబ్బుపై ప్రతీ నెలా వచ్చే వడ్డీని ఆమెకు భృతిగా అందజేయనున్నారు. జీవితకాలం పాటు ఈ ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకున్నామని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు