హైదరాబాద్- దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతోంది. కొవిడ్ కేసులు అంతకంతకు తగ్గుతూ వస్తున్నాయి. తెలంగాణలోను కరోనా దాదాపు నియంత్రణలోకి వచ్చింది. రోజు వారి కేసులు 1500 లకు పడిపోవడం, మరణాల సంఖ్య కూడా ఘణనీయంగా తగ్గిపోవడం కొంత ఉరటనిస్తోంది. దీంతో లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్ కొనసాగుతోంది. మరో గంట పాటు అంటే 6 గంటల వరకు ఇళ్లల్లోకి వెళ్లేందుకు వెసులుబాటు ఉంది. ఈ లాక్ డౌన్ ఆంక్షలు ఈ నెల 19వ తేదీ వరకు అమల్లో ఉండనున్నాయి. కరోనా కేసులు తగ్గడంతో లాక్ డౌౌన్ ఆంక్షలను సడలించి, నైట్ కర్ఫ్యూ విధించేందుకు ప్రభుత్వం సన్నద్దం అవుతోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 20 నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లనుండటం కూడా ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఆదివారం పల్లె, పట్టణ ప్రగతి సమీక్షలో సీఎం కేసీఆర్ ఈ మేరకు అధికారులకు పరోక్ష సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుత లాక్ డౌన్ సండలింపులతో ఇప్పటికే దాదాపు అన్ని ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. దుకాణాలు, ప్రైవేట్ సంస్థలతో పాటు, భూములు, ప్లాట్ల రిజిస్ర్టేషన్లూ జరుగుతున్నాయి. ఐతే రాష్ట్రంలో అన్ని రంగాలకు సంబందించి పూర్తి స్థాయి కార్యకలాపాలను కొనసాగించుకునేందుకు వీలుగా 20వ తేదీ నుంచి మరిన్ని లాక్ డౌన్ సడలింపులు ఇచ్చేందుకు సర్కార్ సిద్దమవుతోంది. ఈనెల 20 నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకే ఆంక్షలు ఉండొచ్చని సమాచారం.
ఈనెల 20 నుంచి లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఆర్టీసీ, మెట్రో రైల్ సర్వీసులను మరింత విస్తరించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర సరిహద్దుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు ఈ పాస్ తప్పనిసరి. ఈ నిబంధనను సైతం ఎత్తేయనున్నారని సమాచారం. ఇక జిమ్‌లు, పబ్‌లను జూలై ఒకటో తేదీ నుంచి అనుతించవచ్చని అధికారులు చెబుతున్నారు. సినిమా హాళ్లను ఢిల్లీ తరహాలో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడిపించేందుకు అనుమతి ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఈనెల 18 లేదా 19న లాక్ డౌన్ ఆంక్షల సడలింపుపై ప్రభుత్వం ఆదేశాలు జారీచేయనుందని అధికారులు చెబుతున్నారు.