రఘురామ బెయిలా.. జైలా, సుప్రీం కోర్టు తీర్పుపై ఉత్కంఠ

court

హైదరాబాద్- న్యూఢిల్లీ- రఘురామ కృష్ణరాజు.. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న పేరు. ఏపీలో అధికార వైసీపీ పార్టీ తరపున నర్సాపురం లోక్ సభ స్తానం నుంచి ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణరాజు.. ఆ తరువాత సొంత పార్టీకి రెబర్ గా మారారు. వైసీపీ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి జగన్ పైనా విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. అంతే కాగు ఏకంగా సీఎం జగన్ బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటీషన్ వేశారు రఘురామ. ఈ పిటీషన్ ను స్వీకరించిన సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. దీంతో ఇన్నాళ్లూ ఓపిక పట్టిన ముఖ్యమంత్రి జగన్ ఇల లాభం లేదని రఘురామ కృష్ణరాజుపై చర్యలు చేపట్టారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు, కులాల మద్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ రఘురామపై రాజద్రోహం కేసు నమోదు చేశారు ఏపీ సీఐడీ పోలీసులు.

raghurama

హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గుంటూరు తరలించారు. ఐతే తనను సీఐడీ పోలీసులు కొట్టారంటూ రఘురామ తీవ్రంగా ఆరోపించారు. కాళ్లకు అయిన గాయాలను సైతం చూపించారు. ఈ అంశంపైనే హైకోర్టు నుంచి సెషన్స్ కోర్టు, అక్కడి నుంచి సుప్రీం కోర్టును ఆశ్రయించారు రఘురామ. తనకు వెంటనే బెయిల్ ఇప్పించాలని, తనపై సీఐడీ పోలీసులు పెట్టిన కేసులను కొట్టేయాలని సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు రఘురామకు సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో సోమవారం రఘురామ కృష్ణరాజును గుంటూరు నుంచి ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు ముగ్గురు ఆర్మీ వైద్యులతో కూడిన మెడికల్ బోర్డు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించింది.

రెండు రోజుల పాటు నిర్వహించిన మెడికల్ టెస్టులకు సంబందించిన రిపోర్టులను సీల్డ్ కవర్ ద్వార సుప్రీం కోర్టుకు సమర్పించారు. దీనిపై సుప్రీం కోర్టు ఈ రోజు సీల్డ్ కవర్ ను ఓపెన్ చేసి విచారణ చేపట్టుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రఘురామ కృష్ణరాజు ఆరోపిస్తున్నట్లు సీఐడీ పోలీసులు ఆయనను కొట్టారా.. లేదా అన్నది ఈ రోజు తేలనుంది. మరోవైపు రఘురామ కృష్ణరాజు బెయిల్ పిటీషన్ పై కూడా సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించనుంది. మరి రఘురామ కృష్ణరాజుకు బెయిల్ వస్తుందా.. లేక జైలుకు వెళ్తారా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. రఘురామ మాత్రం తనకు తప్పకుండా బెయిల్ దొరుకుతుందని ధీమాతో ఉన్నారు.