రఘురామ కృష్ణరాజుకు బెయిల్ మంజూరు

raghurama

న్యూ ఢిల్లీ- వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ఎట్టకేలకు ఊరట లభించింది. సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఎంపీ రఘురామ కృష్ణ రాజు వైద్య పరీక్షల నివేదికతో పాటు, బెయిల్ పిటీషన్ పై శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరన్ సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి వైద్య నివేదికను చదివి వినిపించారు. ఆయన కాలిపై గాయాలతో పాటు, కాలి వేలు ఎముక విరిగినట్లు నివేదికలో పేర్కొన్నారని జస్టిస్ శరన్ వివరించారు. కస్టడీలో ఎంపీని చిత్ర హింసలకు గురిచేసిన విషయం నిజమేనని తేలిందని రఘురామ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గీ వ్యాఖ్యానించారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన కోర్టును కోరారు.

 

Raghurama

సిట్టింగ్ ఎంపీకే ఇలా జరిగితే సాధారణ ప్రజల పరిస్థితేంటని ముకుల్ అన్నారు. ఐతే రఘురామ కృష్ణరాజు స్వయంగా గాయాలు చేసుకున్నారా లేదా అన్నది తెలియాల్సి ఉందని సీఐడీ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది దుష్యంత్ దవే అన్నారు. ఈ క్రమంలో కేసును సోమవారానికి వాయిదా వేయాలన్న ప్రభుత్వం తరఫున న్యాయవాది అభ్యర్థను ధర్మాసనం తోసిపుచ్చింది. వైద్య పరీక్షల నివేదికను ఏపీ ప్రభుత్వం, న్యాయవాదులకు మెయిల్ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. విరామం తరువాత మళ్లీ రఘురామ పిటీషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఇరు పక్షాల వాదనలు విన్నది. ఆ తరువాత రఘురామకు బెయిల్ ఇస్తున్నట్లు తీర్పు చెప్పింది.

ఐతే షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. బెయిల్ పై బయటకు వెచ్చాక ఎట్టి పరిస్థితుల్లోను మీడియాతో మాట్లాడకూడదని రఘురామకు సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇక సీఐడీ విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. ఐతే విరారణకు 24 గంటల ముందే నోటీసులు ఇవ్వాలని ఏపీ సీఐడీకి కోర్టు చూచించింది. మొత్తానికి రఘురామ కృష్ణరాజుకు బెయిల్ మంజూరు కావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం కోర్టు బెయిల్ ఆర్డర్ కాపీ అందగానే ఆర్మీ ఆస్పత్రి నుంచి రఘురామ బయటకు రానున్నారు.