ప్రధాని సొంత రాష్ట్రంలో డ్రగ్ కలకలం.. 600 కోట్ల హెరాయిన్ పట్టివేత

నేషనల్ డెస్క్- భారత్ లో మాదక ద్రవ్యాల సరఫరా రోజు రోజుకు పెరిగిపోతోంది. విదేశాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా దేశంలోకి డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. నిఘా వర్గాలు, పోలీసులు ఎన్ని కఠినమైన చర్యలు తీసుకున్నా మాదకద్రవ్యాల చలామణి మాత్రం ఆగడం లేదు. కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్ ప్రతిరోజు దేశంలోకి వస్తూనే ఉన్నాయి.

తాజాగా గుజరాత్ లో కోట్లాది రూపాయల విలువైన డ్రగ్ ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. రెండు నెలల క్రితం గుజరాత్ లో భారీ స్థాయిలో పట్టుబడ్డ మాదకద్రవ్యాల ఘటన మరవకముందే మళ్లీ డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది. సెప్టెంబరు 13న ముంద్రా పోర్టులో 3 వేల కిలోల హెరాయిన్ పట్టుబడడం అప్పట్లో సంచలనమైంది. ఈ డ్రగ్ విలువ సుమారు 20 వేల కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

heroin 1

ఇదిగో మళ్లీ అదే గుజరాత్ లో తాజాగా 120 కేజీల హెరాయిన్ పట్టుబడింది. సౌరాష్ట్ర పరిధి మోర్బిలోని ఓ గ్రామంలో గత రాత్రి 600 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్‌ ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనకు సంబందించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ హెరాయిన్ సముద్ర మార్గం గుండా వచ్చిందని పోలీసులు గుర్తించారు.

నిందితుడికి 12 కేజీల హెరాయిన్ పాకిస్థాన్ పడవ నుంచి డెలివరీ అయిందని గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. పట్టుబడిన నిందితులను విచారిస్తే మరింత సమాచారం తెలియనుందని పోలీసులు చెబుతున్నారు. ఈ ముఠా ఇప్పటికే కొంత మేర డ్రగ్ ను డీలర్స్ కు పంపిణీ చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు.