రోడ్డుపై బట్టల షాపులో చోరీ, సీసీ టీవీ చూసి షాకైన యజమాని, ఎందుకంటే పోలీసులే

చిత్తూరు క్రైం- ఎక్కడైనా దొంగతనం జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్ కు పరిగెడతాం. దొంగలను పట్టుకుని చోరీకి గురైన సొత్తును ఎలాగైనా రికవరీ చేయాలని పోలీసులను వేడుకుంటాం. కానీ దొంగతం చేసింది పోలీసులే ఐతే.. అవును మీరు విన్నది నిజమే.. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దొంగతం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ అరుదైన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. రోడ్డుపై బట్టలమ్మే దుకాణంలో ఇద్దరు కానిస్టేబుళ్లు చోరీకి పాల్పడ్డారు. చిత్తూరులోని విజయ డెయిరీ సమీపంలో తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి రోడ్డు పక్కన చిన్నపాటి వస్త్రదుకాణం నడుపుతున్నాడు. రాత్రి కాగానే రోడ్డుపైనే ఓ పక్కకు బట్టలన్నీ సర్ది, కొట్టును మూసేసి మరుసటి రోజు దుకాణాన్ని తెరిచేవాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం యూనిఫాం ధరించిన ఓ కానిస్టేబుల్, సివిల్‌ డ్రెస్‌లో ఉన్న మరో కానిస్టేబుల్‌ అర్ధరాత్రి దుకాణం వద్దకు వెళ్లి తమకు కావాల్సిన బట్టలను దొంగతనం చేశారు.

police

మరుసటి రోజు తన బట్టల దుకాణం వద్దకు వచ్చిన యజమాని షాపులో బట్టలు చోరీ అయిన విషయాన్ని గ్రహించాడు. ఎందుకైనా మంచిదన పక్కనే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించాడు. రాత్రి యూనిఫాంలో ఉన్న పోలీసు, మరో వ్యక్తితో కలిసి చోరీ చేసినట్లు గుర్తించాడు. ఇదే విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు బట్టల షాపు యజమాని. సీసీ టీవీ ఫుటెజ్ చూసిన పోలీసులు అవాక్కయ్యారు. యూనిఫాంలో ఉన్న కానిస్టేబుల్ తో పాటు సివిల్ డ్రెస్ లో ఉన్నది ఏఎస్సై అని గుర్తించారు.

ఈ విషయం బయటకు తెలిస్తే తమ పరువు పోతుందని, ఎవరికి చెప్పవద్దని దుకాణాదారున్ని కోరారు. అంతే కాదు పోలీసులు బతిమలాడడంతో అతను పోలీసులకు చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐతే ఈ విషయం మీడియాలో రావడంత ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఆ ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు.