కిలాడీ లేడీ డాక్టర్ సైడ్ బిజినెస్, ఆమె చేసిన పనికి ఛీ అంటున్నారు

బెంగళూరు క్రైం- దేశంలో చిన్న పిల్లలను దొంగిలించి, అమ్ముకునే ముఠాలు చాలా ఉన్నాయి. అందులోను అప్పుడే పుట్టిన నవజాత శిశువులను దొంగిలించి పిల్లలు లేని వారికి, కొన్ని సందర్బాల్లో విదేశాలను సైతం అమ్ముకుంటున్నారని పోలీసుల విచారణలో తేలింది. ఐతే ముఠాల సంగతి పక్కన పెడితే సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఓ డాక్టర్ ఇలాంటి పని చేసిందని తెలిసి అంతా విస్తుపోయారు.

అవును ఈ అమానుష ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. స్వయంగా డైక్టర్ ఓ పసికందును దొంగిలించి, డబ్బులకు అమ్ముకోవడం సంచలనం సృష్టిస్తోంది. ఇది జరిగి సంవత్సరం అవుతుండగా, అప్పటి నుంటి దర్యాప్తు చేసిన పోలీసులు, తాజాగా ఆ డాక్టర్ ను అరెస్ట్ చేశారు. డాక్టర్ రష్మి బెంగళూరులోని ఒక ప్రముఖ హాస్పిటల్‌లో సైకియాట్రిస్ట్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమె దగ్గరకు అనుపమ అనే మహిళ వైద్యం కోసం వచ్చింది.

మానసిక వైకల్యం ఉన్న పాపకు చికిత్స అందించడానికి అనుపమ దంపతులు డాక్టర్ రష్మిని ఆశ్రయించారు. అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. మరో సంతానం కోసం సరోగసీని ఆశ్రయించాలనుకున్న అనుపమ దంపతుల అవసరాన్ని రష్మి సొమ్ముచేసుకోవాలనుకుంది. డాక్టర్ రష్మి భర్తకు వ్యాపారంలో నష్టాలు రావడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. అందుకు తోడు చదువుకునే రోజుల్లో రష్మి తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్‌ బకాయిలు, వడ్డీ ఎక్కువై భారంగా మారాయి.

rashmi1 1

దీంతో అనుపమ దంపతులకు సరోగేట్ తల్లిని ఏర్పాటు చేయించి, వారి నుంచి డబ్బు డిమాండ్ చేయాలని భావించింది. ఐతే అనుకున్న టైంకు సరోగేట్ మదర్ దొరకలేదు. ఈ విషయాన్ని అనుపమకు చెప్పకుండా దాచిన డాక్టర్ రష్మి, సరోగసీ ప్రక్రియ సక్రమంగా జరుగుతోందని, 2020 మే 28 లోపు ప్రసవం అయ్యే అవకాశం ఉందని చెబుతూ వచ్చింది. ఇంతలో ఏంచేయాలో తోచకపోవడంతో డాక్టర్ రష్మీ ఓ పధకం వేసింది. ఆస్పత్రుల్లో అప్పుడే పుట్టిన బిడ్డను దొంగిలించి, అనుపమ దంపతులకు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇలా అనుకున్నదే తడవుగా మూడు ప్రముఖ ఆసుపత్రులకు వెళ్లి శిశువుల కోసం వెతికింది.

చివరికి బీబీఎంపీ హాస్పిటల్‌ లో కన్సల్టింగ్ డాక్టర్‌గా అక్కడి వాళ్లను నమ్మించింది. ఆ ఆస్పత్రిలో అప్పుడే ప్రసవించిన హుస్నా బాను అనే మహిళను గుర్తించి, ఎవరూ లేని సమయంలో తల్లికి మత్తుమందు ఇచ్చి, ఒక రోజు వయసు మాత్రమే ఉన్న బాబును అక్కడి నుంచి ఎత్తుకొచ్చింది. సరోగసి ద్వారా పుట్టిన బాబు అని చెప్పి అనుపమ దంపతులను నమ్మించింది. వారికి బిడ్డను ఇచ్చి 15 లక్షల రూపాయలు తీసుకుంది.

ఐతే తన బిడ్డ కనిపించడంలేదని హుస్నాబాను పోలీసులను ఆశ్రయించింది. కొన్నాళ్లు చూశాక ఇక తన బిడ్డ దొరకదని ఆశలు వదులుకుంది. కానీ పోలీసులు మాత్రం సంవత్సల కాలంగా ఈ కేసుపై విచారణ జరుపుతూనే ఉన్నారు. ఎస్ఐ కేఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని పోలీసు బృందం నిరంతర కృషితో నిందితురాలిని గుర్తించగలిగారు. అనుమానితులను పట్టుకోవడానికి ఈ బృందం సమీప సెల్ ఫోన్ టవర్ నుంచి 35 వేల ఫోన్ కాల్స్ విశ్లేషించింది. చివరికి డాక్టర్ రష్మి ఈ పని చేసిందని తేల్చిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.