అమరావతి- ఆంద్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు, జగన్ సర్కార్ కు మధ్య పోరు నడుస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ పై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీని సవరించడంతో పాటు మరి కొన్ని డిమాండ్స్ ను సర్కార్ ముందు ఉంచారు. ఐతే పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకునేది లేదని తేల్చి చెప్పిన జగన్ సర్కార్, ఉద్యోగులకు పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్సించింది.
దీంతో ఉద్యోగుల, ప్రభుత్వం మధ్య సమస్య ఇప్పుడు ఉద్యమం వరకు వెళ్లింది. ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అయ్యింది. ఇదిగో ఇటువంటి సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు తెలిపారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ఆ కష్టాలు తనకు తెలుసునని, ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని ఇన్నాళ్లు వెనక్కి తగ్గానని, ఇక ఉద్యోగుల ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్లు పవన్ ప్రకటించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామని, జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి, ఇప్పుడు మాట తప్పింది పవన్ కళ్యాణ్ విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెరగాలిగానీ, అందుకు విరుద్దంగా జీతాలు తగ్గించడం ఉద్యోగులను వంచనకు గురి చేయడమేనని పవన్ ఫైర్ అయ్యారు. మండుటెండలో నిలబడి లక్షలాది మంది ఉద్యోగులు నిరసన తెలపడం చాలా బాధ కలిగించిందని చెప్పారు.
జగన్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసిన పాపానికి వందలాది మంది ఉద్యోగులను అరెస్టులు చేయడం, లాఠీ చార్జ్ చేయడం దురదృష్టకరమని పవన్ కళ్యాణ్ అన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకుల ఆదాయం మూడు రెట్లు పెరిగితే, ఉద్యోగుల జీతాలు 30 శాతం తగ్గాయంటూ విమర్శించారు. ఉద్యోగులకు మద్దతుగా ఉండాలని జనసేన పార్టీ నాయకులకు, సైనికులకు పవన్ కళ్యామ్ పిలుపునిచ్చారు.