అమిత్ షా ను అరెస్ట్ చేసిన అధికారి.. ఇప్పుడు తమిళనాడు పోలీస్ బాస్

చెన్నై- తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పదవీభాద్యతలు తీసుకోగానే పాలనాపరమైన నిర్ణయాలు వడివడిగా తీసుకుంటున్నారు. సీఎం పదవి చేపట్టగానే ప్రజా సంక్షేమ పధకాలకు సంబందించిన ఫైళ్లపై సంతకాలు చేశారు. ఇక రాష్ట్రంలో పోలీస్ శాఖ ప్రక్షాళనపై దృష్టి పెట్టిన స్టాలిన్ రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి పీ కందస్వామిని నియమించారు. ఇప్పుడు కందస్వామి నియామకం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎందుకంటే పీ కందస్వామికి 2010లో ఇప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షాను అరెస్ట్ చేశారు. అమిత్ షా గుజరాత్ హోంమంత్రిగా ఉన్న సమయంలో సోహ్రబుధ్దీన్ ఫేక్ ఎన్ కౌంటర్ కేసులో కందస్వామి, అమిత్ షాను అరెస్ట్ చేసి సంచలనం సృష్టించారు. కందస్వామి సీబీఐలో ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఓ రాష్ట్ర హోంమంత్రిని అరెస్ట్ చేయడం అప్పుడు దుమారం రేపింది.

amith shah
Amith shah

ఆ తరువాత అమిత్ షాపై ఆరోపణలను కోర్టు కొట్టేసింది. అలాంటి వివాదాస్పదమైన ఐపీఎస్ అధికారిని ఇప్పుడు తమిళనాడు డీజీపీగా నియమించడం చర్చనీయాంశమవుతోంది. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించే స్టాలిన్ బీజేపీతో అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అయ్యారని.. అందుకే ఇలా అమిత్ షాను అరెస్ట్ చేసిన కందస్వామిని డీజీపీగా నియమించారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కందస్వామి దేశంలో చాలా సంచలన కేసులను డీల్ చేశారు. 2007లో గోవాలో ఓ బ్రిటన్ యువతిని రేప్ చేసి చంపేసిన కేసును ఎంతో చాకచక్యంగా ఛేదించారు. కేరళలో ఎస్ ఎన్ సీ లావాలిన్ స్కామ్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌ని విచారించారు. ఇక ఇప్పుడు కందస్వామి తమిళనాడు డీజీపీగా నియమింపబడ్డారు కాబట్టి మొన్నటి వరకు అధికారంలో ఉన్న అన్నాడీంకే సర్కార్ అవినీతిపై దృష్టి పెడతారన్న వాదన గట్టిగానే విన్పిస్తోంది.