అవును సార్.. డబ్బులు ఇచ్చేదాక బదిలీలు కావటం లేదు!

Ashok gehlot Rajasthan

రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ కు షాక్ ఇచ్చారు ఆ రాష్ట్ర ఉపాధ్యాయులు. గత కొన్నేళ్ల నుంచి ఉపాధ్యాయ బదిలీలు జరగటం లేదని ఎన్నో సార్లు ప్రభుత్వానికి విన్నవించినా అధికారులు స్పందించకుండా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని టీచర్లు బాహాటంగా చెప్పారు. ఇప్పుడు ఇదే వార్త రాజస్థాన్ లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

ఇక విషయం ఏంటంటే..? జైపూర్‌లో రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయులను గౌరవించేందుకు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే దీనికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం బదిలీల, కొత్త పోస్టుల కోసం అధికారులు ఏమైన డబ్బులు డిమాండ్ చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నతో టీచర్లంతా ఏకతాటిగా అవును సార్.. డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ దిమ్మతిరిగేలా అరిచారు.

దీంతో సీఎం ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయితే వారి వాదనను విన్న సీఎం అశోక్‌ గహ్లోత్‌ త్వరలో మీ అన్ని సమస్యలను పరిష్కరించేలా పాలసీని తీసుకొస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో విద్యార్థుల కోసం, ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని సీఎం అన్నారు. ఇక సీఎం ప్రకటనతో ఉపాధ్యాయులు శాంతించారు.