భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు.. నెల వ్యవధిలోనే రెండోసారి..

gas cylinder rate

గ్యాస్‌ సిలిండర్‌ ధరల విషయంలో ప్రజలకు మరోసారి చెయ్యి కాలింది. నెల వ్యవధిలోనే పెట్రోలియం కంపెనీలు గ్యాస్‌ ధరను రెండోసారి పెంచాయి. కాకపోతే ఈసారికి ఆ షాక్‌ కమర్షియల్‌ సిలిండర్‌ వినియోగదారులకు మాత్రమే ఇచ్చింది. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధరను మాత్రం ఈసారికి పెంచలేదు. కమర్షియల్‌ సిలిండర్‌కు ఏకంగా 43 రూపాయలు పెంచారు. సెప్టెంబర్‌ 1న 75 రూపాయలు పెంచిన కంపెనీలు ఇప్పుడు అక్టోబరు 1న 19 కిలోల సిలిండర్‌పై మరోసారి పెంచడంతో ఇప్పుడు హైదరాబాద్‌లో కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.1952కు చేరింది. విశాఖలో రూ.1825, విజయవాడలో రూ.1916, ఢిల్లీలో రూ.1736గా ఉంది.

కరోనా కష్టాల నుంచి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు ఇది భారీ షాకే అవుతుంది. మూలిగే నక్కపై మూడిత్తుల తాటికాయ పడ్డట్టే అవుతుంది. వారికి ఇప్పుడు కాస్తో కూస్తో వ్యాపారం జరుగుతోంది. ఇప్పుడు గ్యాస్‌ పెరిగినప్పుడల్లా వారు రేట్లు పెంచుకుంటూ పోలేరు. మరి ఇలా నెలకోసారి గ్యాస్‌ సిలిండర్‌ రేట్లు పెంచుతూ పోతే చిరు వ్యాపారుల పరిస్థితి అగమ్యగోయచరంగానే ఉంటుంది. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్‌పై కూడా మళ్లీ రేట్లు పెంచితే సామాన్యులపై పెను భారం పడుతుంది.