నింగి నుంచి నేలకు దిగివస్తోన్న ఆక్సిజన్ ధరలు!..

ఆక్సిజన్‌కు అంతగా గిరాకీ లేని ఏప్రిల్ మొదటి వారంలో 150 క్యూబిక్ మీటర్ మెడికల్ ఆక్సిజన్ ఉండే పెద్ద సిలిండర్‌ను నింపేందుకు రూ. 350 తీసుకునేవారు. ఆ తర్వాత గిరాకీ పెరగడంతో ఆ ధర రూ. 600కు పెరిగింది. కొవిడ్‌ మహమ్మారి మొదటిదశ కంటే రెండో దశలో బాధితులకు ఆక్సిజన్‌ అవసరాలు బాగా పెరిగాయి. అదే నెల 20 నాటికి రూ.1000కి పెరగ్గా ఈ నెల మొదటి వారానికి మరింత పెరిగి రూ. 2500 నుంచి రూ. 3 వేలకు చేరింది. ఆసుపత్రులకు సిలిండర్లలో సరఫరా అయ్యే మెడికల్‌ ఆక్సిజన్‌ ధరతో పాటు, ఇంటి వద్ద స్వల్ప స్థాయిలో ఆక్సిజన్‌ వినియోగించుకునే కాన్సన్‌ట్రేటర్ల ధరలూ కొన్నిరెట్ల మేర ఎక్కువయ్యాయి. ఆక్సిజన్‌ శాచురేషన్‌ స్థాయులు 90 కంటే తగ్గిన వారికి కనీసం నిమిషానికి 5 లీటర్ల సామర్థ్యంతో మెడికల్‌ ఆక్సిజన్‌ అందించాల్సిన పరిస్థితి. ఈ సదుపాయం ఉన్న పడక కోసం ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజుకు రూ.ఇరవై వేలు, ముఫ్ఫై వేలూ కూడా వసూలు చేశారు.

jpg 10

ఏప్రిల్‌ మధ్య నుంచి విపరీతంగా పెరిగిన మెడికల్‌ ఆక్సిజన్‌, కాన్సన్‌ట్రేటర్ల ధరలు గణనీయంగా దిగివచ్చాయి. కేసులు తగ్గుముఖం పట్టడం, ఆక్సిజన్‌ అందుబాటు సదుపాయాలు మెరుగవ్వడం ఇందుకు కారణమని చెబుతున్నారు. పెద్ద సిలిండర్‌ రీఫిల్లింగ్‌ ధర రూ.రెండు వేలూ,  మూడు వేలూ నుంచి రూ.ఆరువందలకు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల ధర రూ.అరవై -డెబ్బై వేల  నుంచి రూ.పదిహేను- ఇరవై అయిదూ వేలకు తగ్గాయి. ఒక రోగికి నిమిషానికి 5 లీటర్ల సామర్థ్యంతో ఆక్సిజన్‌ నిరంతరాయంగా అందిస్తే పెద్ద సిలిండరు 10-12 గంటల పాటు వస్తుంది. అదే 2 లీటర్ల సామర్థ్యంతో అందిస్తే 18-24 గంటల పాటు ఆక్సిజన్‌ సరఫరా చేయొచ్చు. అదీ అవసరానికి లభ్యం కాక ఎందరో ప్రాణాలు కోల్పోయారు.  ఇప్పుడీ ధరలు దిగిరావడానికి కొవిడ్ కేసులు తగ్గడం, అదే సమయంలో ఆక్సిజన్ సరఫరా మెరుగవ్వడమే కారణం.