కరోనా వ్యాక్సిన్‌ చేసిన వండర్‌! పక్షవాతం మాయమైంది.. మూగ వ్యక్తి మాట్లాడుతున్నాడు!

కరోనా ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లతో ప్రపంచ మానవాళి జీవనం అస్తవ్యస్తమైంది. ఇప్పుడు థర్డ్‌ వేవ్‌ తన ప్రతాపం చూపిస్తుంది. అయినా కూడా చాలా మంది కోవిడ్‌ నియంత్రణకు వ్యాక్సిన్‌ వేసుకునేందుకు భయపడుతున్నారు. కానీ ఒక చోట మాత్రం కరోనా వ్యాక్సిన్‌ మాత్రం అద్భుతం చేసింది. పక్షవాతంతో మంచానికే పరిమితం అయిన వ్యక్తి జీవితంలో వెలుగు నింపింది. అలాగే అతని మాటలు కూడా తెప్పించింది.

జార్ఖండ్‌ రాష్ట్రంలోని బొకారో జిల్లాలోని పెతర్వార్ మండలం సల్గాడి గ్రామంలో దులార్ చంద్ (55) అనే వ్యక్తి ఐదేళ్ళ క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు, వెన్నెముకకు ఆపరేషన్ చేసి.. అతి కష్టం మీద వైద్యులు ప్రాణాలను నిలబెట్టారు. అయితే అప్పటి నుంచి దులార్ చంద్ శరీరంలో అవయవాలు పనిచేయడం మానేశాయి. మాట కూడా పడిపోయింది. అప్పటి నుంచి మంచం మీదనే అన్నీ. అయితే కరోనా నివారణలో భాగంగా వేస్తున్న కోవిడ్‌ టీకాను దులార్ చంద్‌కు కూడా వేయించారు కుటుంబ సభ్యులు. జనవరి 4న అంగన్‌‌వాడీ కార్యకర్తలు దులార్ చంద్ ఇంటికి వెళ్లి మరీ కోవిషీల్ట్ టీకాను ఇచ్చారు.

అయితే ఇక్కడే మ్యాజిక్ జరిగింది. వ్యాక్సిన్ అతని పాలిట సంజీవని అయ్యింది. డాక్టర్లకు కూడా అర్ధం కాని విధంగా దులార్‌ చంద్‌ కోలుకున్నాడు. తర్వాతి రోజు నుంచి మాట్లాడడం ప్రారంభించాడు. అంతేకాదు శరీరంలోని అవయవాల్లో కదలికలు వచ్చాయి. దీంతో దులార్‌చంద్ కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ నిజంగా అద్భుతం చేసిందని దులార్‌చంద్ కుటుంబ సభ్యులతో పాటు గ్రామ పంచాయతీ సర్పంచ్ సుమిత్రా దేవి కూడా సంతోషంగా చెబుతున్నారు. మరి కరోనా వ్యాక్సిన్‌తో జరిగిన ఈ అద్భుతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.