వరుసగా 14వ సారి నంబర్ వన్ కుబేరుడిగా ముఖేష్ అంబానీ

బిజినెస్ డెస్క్- భారత్ లో అపర కుబేరుల్లో ముఖేష్ అంబానీ మరో సారి తన నంబర్ వన్ స్థానాన్ని పదిల పరుచుకున్నారు. ఈ సంవత్సరం ఫోర్బ్స్‌ విడుదల చేసిన వంద మంది భారత కుబేరుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీకి మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. 9,270 కోట్ల డాలర్లతో అంటే మన రూపాయల్లో సుమారు 6.86 లక్షల కోట్ల సంపదతో మళ్లీ నంబర్ వన్ కుబేరుడిగా నిలిచారు. ముఖేష్ అంబాని వరుసగా 14వ ఏడాదీ అత్యంత ధనవంతుడిగా నిలవడం విశేషం.

గత సంవత్సరంతో పోల్చితే ముఖేష్ అంబాని ఆస్తి 400 కోట్ల డాలర్ల మేర పెరిగిందని ఫోర్బ్స్‌ తెలిపింది ఇక. అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ 7,480 కోట్ల డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. మన రూపాయల్లో ఆయన సంపద 5.53 లక్షల కోట్లు. గత సంవత్సరంలో పోలిస్తే గౌతమ్ అదానీ సంపద మూడు రెట్లు పెరిగింది. ఇక హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపకుడు శివ్‌ నాడార్‌ మూడో స్థానంలో, డీ మార్ట్‌ స్టోర్ల అధిపతి రాధాకిషన్‌ దమానీ నాలుగో స్థానంలో, సీరమ్‌ ఇన్‌ స్టిట్యూట్‌ చైర్మెన్ సైరస్‌ పూనావాలా ఐదో స్థానంలో నిలిచారు.

gautam adani

ఈసారి సైరల్ పూనావాలా హిందూజాల స్థానాన్ని ఆక్రమించుకున్నారు. హిందూజా సోదరుల సంపద 1,400 కోట్ల డాలర్లకు తగ్గడంతో ఈ సంవత్సరం వారు 15వ స్థానానికి పరిమితం అయ్యారు. ఇక ఫోర్బ్స్ జాబితాలో మహిళలు తమ సత్తా చాటారు. ఓపీ జిందాల్‌ గ్రూప్‌ చైర్‌ పర్సన్‌ సావిత్రి జిందాల్‌ దేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. 1,800 కోట్ల డాలర్ల ఆస్తితో ఈసారి ఆమె టాప్‌ టెన్‌ జాబితాలోకి మళ్లీ ప్రవేశించారు.

కరోనా విపత్కర పరిస్థితుల్లోను 80 శాతానికి పైగా కుబేరుల సంపద పెరిగడం గమనార్హం. ఈ యేడాది కాలంలో 61 మంది ఆస్తి కనీసం 100 కోట్ల డాలర్ల మేర పెరిగిందని ఫోర్బ్స్ తెలిపింది. ఐతే నలుగురు ఫార్మా బిలియనీర్ల సంపద మాత్రం తగ్గిపోయింది. ఈ సంవత్సరం ఫోర్బ్స్ జాబితాలో కొత్తగా ఆరుగురికి స్థానం లభించింది. గత ఏడాది జాబితా లోని 11 మంది ఈ యేడాది స్థానం కోల్పోయారు. గడిచిన ఏడాది కాలంలో ఫోర్బ్స్‌ కుబేరుల మొత్తం సంపద 50 శాతం అంటే 25,700 కోట్ల డాలర్ల మేర వృద్ధి చెంది 77,500 కోట్ల డాలర్లకు అంటే సుమారు 57.35 లక్షల కోట్లకు పెరిగిందని ఫోర్బ్స్ తెలిపింది.