బైక్ పై తల్లి మృతదేహం, సాయం చేసేందుకు ఎవరు లేరు

dead body

కృష్ణ రూరల్- కరోనా మనుషుల ప్రాణాలనే కాదు అనుబంధాలను లాగేసుకుంటుంది. కరోనా మహమ్మారి వచ్చాక మనుషుల్లో మానవత్వం మాయమైపోయింది. కరోనా సోకినవారిని చూస్తే ఆమడ దూరం పారోపోతున్నారు. సొంత వాళ్లకు కరోనా వచ్చినా ఆదరించేవారు లేక అల్లాడిపోతున్నారు. ఇక కరోనా సోకి మరణిస్తే.. దహన సంస్కారాలు చేసే దిక్కు లేక దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. అందరూ ఉన్నా దిక్కులేని చావు చస్తున్నారు చాలా మంది. ఇదిగో ఇలాంటి ఘటనే ఆంద్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో జరిగింది. ఓ మహిళ వయోభారంతో కన్నుమూయగా ఆమె దహనసంస్కారాలకు అయినవాళ్లెవరు సహకరించకపోవడంతో.. చివరకు కొడుకు, మనవడు ఆమె మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తరలించాల్సిన దుస్తితి వచ్చింది. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

dead body

గ్రామానికి చెందిన 80 ఏళ్ల పెనుకుదుర దమయంతి శుక్రవారం రాత్రి వయో భారంతో చనిపోయారు. ఆమెకు ముగ్గురు కొడుకులుండగా, ఇద్దరికి కరోనా సోకడంతో ఏలూరులో చికిత్స పొందుతున్నారు. కరోనా భయంతో బంధువులు, ఇరుగుపొరుగువారు ఎవరూ ఆమె దహవసంస్కారాలు చేసేందుకు రాలేదు. చివరకు చేసేదేమీ లేక మరో కుమారుడు, మనవడు కలిసి మృతదేహాన్ని శవ పేటికలో పెట్టి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు. మిగిలిన ఇద్దరు కొడుకులు కనీసం తల్లి చివరి చూపుకు నోచుకోలేదు. ఆ గ్రామంలో చాలా మంది బంధువులు ఉన్నా, స్నేహితులు ఉన్నా ఎవరు ఆమె అంత్యక్రియలకు సహకరించలేదు. ఇలా బైక్ పై మహిళ మృతదేహాన్ని తీసుకెళ్లడం చూసి అంతా అయ్యో అన్నవాళ్లే కాని ఎవ్వరు సాయం చేయలేదు. కరోనా మనవత్వాన్ని సైతం మంటగలుపుతోందనడానికి ఇంత కంటే నిదర్శనం ఇంకేం కావాలి.