మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్- టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లోనే కాదు.. సామాజిక అంశాల పట్ల అంకితభావంతో ఉంటారన్న సంగతి అందరికి తెలిసిందే. జనం కష్టాలు సోషల్ మీడియా ద్వార తన దృష్టికి వచ్చినా వెంటనే స్పందిస్తుంటారు కేటీఆర్. చాలా మందికి తన సొంత డబ్బులతో సాయం చేసి, తన మంచి మనసును చాటుకుంటూ వస్తున్నారు.

వైద్యం, చదువుకు పేద పిల్లలకు ఆర్థిక సాయం చేయడంతో పాటు ఇతర సమస్యలనూ పరిష్కరిస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటుంటారు కేటీఆర్. ఇదిగో ఇటువంటి సమయంలో మంత్రి కేటీఆర్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులను తన కాన్వాయ్‌ లో ఆసుపత్రికి తరలించారు.

KTR 1

మియాపూర్‌ కు చెందిన ఇద్దరు విద్యార్థులు బుధవారం రాత్రి హకీంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో మంత్రి సిరిసిల్ల నుంచి హైదరాబాద్‌ వస్తున్నారు. ప్రమాదాన్ని చూసి చలించిపోయిన కేటీఆర్ వెంటనే కారు దిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గాయపడ్డ విధ్యార్ధులను వెంటనే తన కాన్వాయ్‌ లోని ఎస్కార్ట్ వాహనంలో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు.

వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారలను ఆదేశించారు కేటీఆర్. ఇందుకు సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మంత్రి కేటీఆర్ మరోసారి తన మానవత్వాన్ని, మంచి మనసును చాటుకున్నారని అంతా ప్రశంసిస్తున్నారు. ప్రజల పట్ల ఆయన చూపుతున్న ప్రేమకు అంతా ఫిదా అవుతున్నారు.