రాబోవు రెండు వారాలు చాలా కీలకం- మంత్రి కేటీఆర్

minister ktr

హైదరాబాద్- దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా పరిస్థితి అందుపులోనే ఉందని ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఐనప్పటికీ రాబోయే రెండు వారాలు చాలా కీలకమని చెప్పారు. కరోనా కట్టడిపై మంత్రి కేటీఆర్ సారథ్యంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ బుధవారం మొదటిసారిగా సమావేశమైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులన్నింటిలో పూర్తి స్థాయి బెడ్లు, ఆక్సిజన్, రెమిడేసివిర్ ఇంజక్షన్లు అందుబాటులోనే ఉన్నాయని ఈ సందర్బంగా కేటీఆర్ చెప్పారు. ప్రతి రోజూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వాడే ఇక్సిజన్‌పై వివరాలున్నాయని, మితిమీరిన ఇంజక్షన్లు, అనవసర ఆందోళనలు వద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్యాదికారులతో రోజూ మాట్లాడుతున్నారని, రాబోయే రోజుల్లో టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్, రెమిడేసివిర్, ఆక్సిజన్ ఉత్పత్తిపై ప్రత్యేకంగా భేటీ అవుతామని మంత్రి తెలిపారు.

తెలంగాణలో ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని చెప్పిన కేటీఆర్, ఇప్పటికే రాష్ట్రంలో 60 లక్షల ఇళ్లలో సర్వే పూరైందని తెలిపారు. ఇంటింటి ఫీవర్ సర్వేలో అవసరం అయిన వారికి మెడికల్ కిట్స్ ఇస్తున్నామని, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం వల్ల వేలాది మందిని కాపాడగలమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు, ప్రైవేట్ ఆస్పత్రుల్లోను బెడ్స్‌ను భారీగా పెంచామని కేటీఆర్ తెలిపారు. ఆక్సిజన్ సరఫరా గురించి కూడా కమిటీ సమావేశంలో చర్చించామని, ప్రస్తుతానికి అవసరమైన డిమాండ్ సప్లై విషయంలో వివరాలు తీసుకున్నామని, ఆక్సిజన్ ఆడిట్‌ను ప్రభుత్వం ప్రత్యేకంగా చేస్తుందని అన్నారు. కరోనా కట్టడికి చర్యలను ఎప్పటికప్పుడు వేగవంతం చేస్తున్నామని, మరింత ప్రణాళికతో కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.