హైదరాబాద్- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా భిమ్లా నాయక్. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ఈ వేడుకకు తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. భీమ్లా నాయక్ లో పవన్ తో పాటు నటించిన రానా దగ్గుబాటి, ఇత యూనిట్ అంతా ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ పవన్ కళ్యాణ్ ను పొగడ్తలలో ముంచెత్తారు. ఒక మంచి మనిషి, మంచి మనసున్న మనిషి, విలక్షణమైన శైలి. నాకు తెలిసి సూపర్ స్టార్లు, సినిమా స్టార్లు చాలా మంది ఉంటారు కానీ.. కల్ట్ ఫాలోయింగ్ ఉండే విలక్షణ నటుడు పవన్ కల్యాణ్.. అని కేటీఆర్ అన్నారు. చాలా సమయం అయింది. అయినా సరే ఓపికతో వేచి చూస్తున్న తమ్ముళ్లందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి ప్రభుత్వ ప్రతినిధిగా రాలేదు. పవన్ కల్యాణ్ గారి సోదరుడిగా వచ్చాను.. అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
మేమంతా ఆయన తొలిప్రేమ సినిమా చూసిన వాళ్లమే. అప్పటి నుండి ఇప్పటి వరకు అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం అనేది ఒక అసాధారణమైన విషయం. వారికి హృదయపూర్వకంగా అభినందనలు. ఈ వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఎనిమిదేళ్లుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాదు.. భారత చలనచిత్ర పరిశ్రమకి ఒక సుస్థిరమైన కేంద్రంగా హైదరాబాద్‌ని రూపొందించాలనే ధృడసంకల్పంతో తెలంగాణ ముఖ్యమంత్రి, గౌరవనీయులు కేసీఆర్‌గారి నాయకత్వంలో పురోగమిస్తున్న క్రమంలో మాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది.. అని కేటీఆర్ చెప్పారు.
కల్యాణ్ గారి లాంటి పెద్దలందరూ అండగా ఉంటే.. తప్పకుండా హైదరాబాద్ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కేంద్రంగా మారుతుందనే విశ్వాసం నాకు ఉంది. ఈ రోజు సీఎం కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అతి ముఖ్యమైన మల్లన్న సాగర్ రిజర్వాయర్‌కి ప్రారంభోత్సవం చేశారు. ఈరోజు గోదారమ్మకి కూడా భూదారి చూపెట్టిన కేసీఆర్‌గారికి మనందరం ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేద్దాం. కల్యాణ్‌గారిని కోరుతున్నా.. మీరు షూటింగ్స్ గోదావరి జిల్లాలలోనే కాదు తెలంగాణలో కూడా ఇప్పుడు కాళేశ్వరం పుణ్యమా అని చెప్పి మల్లన్న, కొండపోచమ్మ సాగర్‌లో కూడా చేయవచ్చు.. అని కేటీఆర్ అన్నారు.ప్రపంచంలోని అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ని ఇక్కడ మూడున్నర సంవత్సరాలలోనే పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్ గారిది. ఇక్కడ మీరు షూటింగ్స్ చేసి, తెలంగాణ ప్రాంతానికి మరింత ప్రాచుర్యం తీసుకువస్తారని చిత్ర పరిశ్రమను కోరుతున్నాను. భీమ్లా నాయక్ చిత్రం ద్వారా చాలా మంది అజ్ఞాత సూర్యులని బయటికి తీసుకువచ్చినందుకు పవన్ కల్యాణ్ గారికి, చిత్రయూనిట్‌కి అభినందనలు. హాజరైన ప్రతి ఒక్కరికీ, అలాగే సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు.. అని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.