భీమ్లా నాయక్ సెట్లో ‘మా’ వివాదం, పవన్ కళ్యాణ్ తో మంచు మనోజ్ భేటీ

ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు ముగిసినా వివాదం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ ఘన విజయం సాధించడం, ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఓడిపోవడం చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల నిర్వహణపై అనుమానాలు వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ మొత్తం రాజీనామా చేయడం ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది.

‘మా’ ఎన్నికలు ముగిసాక కూడా సినీ పరిశ్రమలో ని రెండు వర్గాలు, ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. దీంతో ‘మా’ ఎన్నికల వేడి ఇంకా కొనసాగుతోంది. రెండు వర్గాల మధ్య మాటల యుధ్దం జరుగుతోంది. ఇదిగో ఇటువంటి సమయంలో మంచు విష్ణు ఇండస్ట్రీ పెద్దలతో కలవడం ఆసక్తికరంగా మారింది. తండ్రి మోహన్ బాబుతో సహా బాలకృష్ణను కలిశారు మంచు విష్ణు.

Manoj 1

అంతే కాదు త్వరలోనే మెగాస్టార్ చిరంజీవిని కూడా కలుస్తానని ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు చెప్పారు. ఇదిగో ఇటువంటి సమయంలో మోహన్ బాబు రెండో కొడుకు, మంచు విష్ణు తమ్ముడు మంచు మనోజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలవడం ఇండస్ట్రీలో ఆసక్తిరేపుతోంది. హైదరాబాద్‌ లోని భీమ్లా నాయక్ మూవీ సెట్లో పవన్ కల్యాణ్‌తో మంచు మనోజ్ గురువారం సాయంత్రం భేటీ అయ్యారు.

ముందు నుంచి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే, మంచు మనోజ్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. అదే సమయంలో మనోజ్ పట్ల, పవన్ కల్యాణ్ ఎంతో స్నేహపూర్వకంగా ఉంటూ వస్తున్నారు. వీరిద్దరూ సుమారు గంటకుపైగా పలు విషయాలపై చర్చించుకున్నారు. ఐతే ‘మా’ ఎన్నికల వివాదాల నేపధ్యంలో పవన్ కళ్యాణ్, మనోజ్ భేటీ సంచలనం రేపుతోంది. ప్రధానంగా ‘మా’ ఎన్నికలు, తదనంతర పరిణామాలపైనే వీరిద్దరు చర్చించుకున్నారని ఫిల్మ్ నగర్ లో ప్రచారం జరుగుతోంది.