సంక్రాంతి పండగలో విషాదం.. మనిషి గొంతు కోసిన గాలిపటం దారం

మంచిర్యాల- సంక్రాంతి పండగను తెలుగు రాష్ట్రాల్లో అంతా సందడిగా జరుపుకుంటున్నారు. చిన్నా పెద్దా అంతా కలిసి సంక్రాంతి స్పెషల్ పతంగులను ఎగురవేస్తున్నారు. ఐతే కైట్స్ ఎగురవేసే సమయంలో మంచిర్యాల జిల్లాలో విషాదం నెలకొంది. పతంగులకు వాడే మాంజా దారం ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది.

మాంజా దారం వాడొద్దని అధికారులు చెబుతున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. ఆ నిర్లక్ష్యమే సంక్రాంతి పండగ రోజు ఓ నిండుప్రాణాన్ని బలి తీసుకుంది. రోడ్డుపై తనదారిన తాను వెళ్తున్న అమాయకుడు బలైపోయాడు. పతంగికి కట్టిన మాంజా దారం కనిపించక ముందుకెళ్లడంతో గొంతు తెగిపోయింది. ఓ వ్యక్తి భార్య కళ్లెదుటే బండిపై నుంచి పడిపోయి తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు విడిచాడు.

Kite Strings 1

ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. మంచిర్యాల జాతీయ రహదారిపై దంపతులు బైక్‌పై వెళ్తుండగా ఊహించని ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తుండగా మంజా దారం తగిలి బైక్ నడుపుతున్న భర్త గొంతు తెగిపోయింది. అక్కడే కిందపడిపోయిన ఆయన తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయాడు. కళ్లెదుటే కట్టుకున్న భర్త ప్రాణాలు పోవడంతో ఆ భార్య రోదన వర్ణనాతీతంగా ఉంది.

గాలిపటానికి కట్టిన మాంజా దారం నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, మృతుడిని జగిత్యాల జిల్లా గొల్లపల్లికి చెందిన భీమయ్యగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.