ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుంటా..మమత సంచలన వ్యాఖ్యలు

కోల్ కత్తా- దేశ ప్రధాని నరేంద్ర మోదీని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరగంట పాటు వెయిట్ చేయించారన్న వార్త బాగా వైరల్ అయ్యింది. దీంతో ప్రధానిని అలా తన కోసం ఎదురుచూసేలా చేయడం సరికాదని దీదీపై విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయంగా విభేదాలున్నా.. అధికారిక కార్యక్రమాల్లో ఇలా ప్రధానిని అవమానించడం సమంజసం కాదని చాలా మంది కామెంట్స్ చేశారు. దీంతో మరోసారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, కేంద్ర ప్రభుత్వం మధ్య రాజకీయ వేడి రాజుకుంది. యాస్ తుఫాను సమీక్ష సందర్బంగా ప్రధాని మోదీని మమత బెనర్జీ ఉద్దేశపూర్వకంగానే చాలా సేపు వేచి ఉండేలా చేసినట్లు వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. వెస్ట్ బెంగాల్ లో బీజేపీ ఓటమిని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే తనపై లేనిపోని నిందలు వేసి అప్రతిష్టపాలు చేస్తున్నారని దీదీ మండిపడింది.

mamata

బెంగాలీల కోసం అవసరమైతే మోదీ కాళ్ళు పట్టుకోవడానికైనా తాను సిద్ధమని వ్యాఖ్యానించారు మమత. పశ్చిమ బెంగాల్ కు సాయం చేయాలంటే తన కాళ్ళు పట్టుకోవాలని ప్రధాని మోదీ చెబితే, తాను బెంగాలీల కోసం తప్పకుండా ఆయన కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నానని దీదీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్న మీడియా ద్వార తనను లక్ష్యంగా చేసుకుందని ఆమె ఆరోపించారు. ఆ వార్తలు ఏకపక్షంగా ఉన్నాయని, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండానే వార్తలు రాశారని దీదీ ఫైర్ అయ్యారు. తనకు జాతీయ స్థాయి మీడియాలో కొందరు మిత్రులు ఉన్నారని చెప్పిన మమత, కొన్నిసందర్బాల్లో తమకు ప్రధాని కార్యాలయం నుంచి సూచనలు వస్తుంటాయని, వాటి ప్రకారం వార్తలను ప్రసారం చేస్తామని వారు చెప్పారని తెలిపారు. ఈ క్రమంలోనే సెలక్టివ్ న్యూస్ ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని ఆరోపించారు.

అసలు ఆ రోజు యాస్ తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు తాను సాగర్, డిఘా వెళ్ళాలని ముందే అనుకున్నానని మమత చెప్పారు. ఆ తర్వాత అకస్మాత్తుగా ఓ ఫోన్ కాల్ వచ్చిందన్నారు. తుఫాను తర్వాతి పరిస్థితిని పరిశీలించేందుకు ప్రధాన మంత్రి బెంగాల్ వస్తున్నట్లు చెప్పారని తెలిపారు. తాము ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవడానికి ముందు ఒక గంటపాటు తమను వేచి ఉండేలా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు ఆపేశారని మమత ఆరోపించారు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి సమావేశం జరిగే ప్రదేశానికి వెళ్లేసరికే ప్రధాని సమావేశం ప్రారంభమైందని దీదీ చెప్పారు. సమావేశం జరుగుతోంది కాబట్టి మీరు వెళ్ళకూడదని అధికారులు తమను అడ్డుకున్నారని ఆరోపించారు. ఆ తర్వాత ఈ సమావేశం కాన్ఫరెన్స్ హాల్‌లో జరుగుతుందని తెలుసుకుని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలిసి తాను అక్కడికి వెళ్ళానని చెప్పుకొచ్చారు. తాము అక్కడికి వెళ్ళేసరికి పీఎం మోదీ, గవర్నర్, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, కొందరు ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలు సమావేశమైనట్లు గుర్తించామన్నారు. అందుకే తుఫానుకు సంబందించిన నివేధికను ప్రధాని మోదీకి అందించి, అక్కడి నుంచి వచ్చేశామని తెలిపారు మమతా బెనర్జీ.