వాళ్లకు ఆర్జీవీతో బయోపిక్ తీయించుకునే దమ్ముందా- కొండా సురేఖ సవాల్

వరంగల్- రామ్ గోపాల్ వర్మ ఏం చెసినా సంచలనమే. ఆయన సినిమా తీసినా, వెబ్ సిరీస్ చేసినా, యాంకర్ ను ఇంటర్వూ చేసినా, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా.. ఇలా ఆర్జీవి ఏంచేసినా అది వివాదాస్పదం అవ్వడం మాత్రం ఖాయం. తానేం చేసినా అది చిరిగి చాటవ్వాలనే వర్మ కోరుకుంటాడనుకొండి. అన్నట్లు రాంగోపాల్ వర్మ ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు కొండా సురేఖ, కొండా మురళి బయోపిక్ తీస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

కంపెనీ ప్రొడక్షన్ సమర్పణలో యోయో టాకీస్ పతాకంపై అదిత్ అరుణ్, ఇర్రా మోర్ ప్రధాన పాత్రలలో మల్లా రెడ్డి, నవీన్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ‘కొండా’ పేరును ఖరారు చేశారు వర్మ. ఈ సినిమా షూటింగ్ వరంగల్‌ లో కొండా సురేఖ, మురళి సొంత ఊరు వంచనగిరిలో మంగళవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ క్రమంలో కొండా సురేఖ పలు ఆసక్తిరమైన విషయాలు చెప్పారు.

RGV 1

కొండా మురళి సైకిల్ మీద టమోటాలు పెట్టుకొని వరంగల్ మార్కెట్ కెళ్ళి అమ్మిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎవరి సపోర్ట్ లేకుండా రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. ఆయన ప్రజాభిమానంతోటే స్వతహాగా ఎదిగాడనేది మన అందరికీ తెలుసు. బయోపిక్ తీయాలంటే ధైర్యం ఉండాలి. మా పైన విమర్శలు చేసే వారిని నేను ఒక్కటే సవాల్ చేస్తున్న.. మీకు ధైర్యం ఉంటే మీ బయోపిక్‌లు తీసుకోండి. మీ సొంత పైసలు పెట్టే చేయించుకోండి.. అని కొండా సురేఖ సవాల్ విసిరారు.

మా కథ వెనుక ఒక చరిత్ర ఉంది.. మా జీవితాల వెనుక ఒక చరిత్ర ఉంది.. మీకు చెప్పుకోవడానికి ఏమీ లేదు.. మీరందరూ కూడా పెత్తందార్లు, భూస్వాములు, బడుగు బలహీన వర్గాలను అణగదొక్కేటటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు.. ఎంతసేపూ పక్క వాళ్ళను ఎదగనీయకుండా చేసేటటువంటి గుణం ఉన్న వాళ్లే కానీ.. పేదవాడిని ప్రేమించేటటువంటి మనసున్న వ్యక్తి మురళి.. ప్రతి ఒక్కరికి కూడా కాదనకుండా దానమిచ్చే వ్యక్తి.. ఈ గ్రామంలో జూనియర్ కాలేజ్, మోడల్ స్కూల్ భూములుగాని ఇవన్నీ ఆయన ప్రజల కోసం ఇవ్వకపోతే కోట్ల రూపాయలను సొమ్ముచేసుకొనే వాడు.. అని చెప్పారు కొండా సురేఖ. తమ జీవిత కధను ఆర్జీవి మంచి సినిమాగా తీస్తారన్న నమ్మకం తమకుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.