కేరళను తలపిస్తున్న విశాఖపట్నం.. సముద్ర తీరంలో పుట్టీల పోటీలు

విశాఖపట్నం- పడవల పోటీలు అంటేనే మనకు కేరళ గుర్తుకు వస్తుంది. కేరళ పడవల పోటీలను పెట్టింది పేరు. ఓనమ్ పండగ సందర్బంగా కేరళలో జోరుగా పడవల పోటీలు జరగుతాయి. ఈ పడవల పోటీలను చూసేందుకు దేశం నలువైపుల నుంచి జనం వస్తుంటారు.

ఇదిగో ఇప్పుడు విశాఖపట్నం కేరళను తలపించింది. సంక్రాంతి పండగ సందర్బంగా విశాఖ జిల్లాలో పుట్టీల పోటీలను నిర్వహించారు. విశాఖ జిల్లా బంగారమ్మ పాలెం గ్రామంలో సంక్రాంతి పండుగను సరికొత్తగా నిర్వహించుకున్నారు. మత్స్యకారులు వేటకు వినియోగించే పుట్టీలతో పోటీలను నిర్వహించారు.

Visakha 1

విశాఖ జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గంలోని మూడు మండలాల నుంచి మత్స్యకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. స్థానికులు, మత్స్యకారుల కేరింతల మధ్య పోటీలు ఉత్సాహభరితంగా జరిగాయి. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు.

సంక్రాంతి పండుగ అంటే కొత్త అల్లుళ్లు, గొబ్బెమ్మలు, రంగవల్లులు, కోడి పందేలు, ఎడ్ల బండిల పోటీలు గుర్తుకొస్తాయి. అటువంటిది ఈ సారి కొత్తగా పుట్టీల పోటీలను నిర్వహించడం విశేషం. ఈ పుట్టీల పోటీలు కొత్త ట్రెండ్ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాయి. నిషేధిత కోడి పందేల, పేకాట కంటే ఈ ఆరోగ్యకరమైన పుట్టీల పోటీలు స్థానికులకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చాయి.