కరోనా సమయంలోనూ ఐటీ రంగ ఉద్యోగాలు పెరిగాయి!..

కరోనా సెకెండ్ వేవ్  ఐటీ రంగంపై తాత్కాలిక ప్రభావాన్నే చూపింది. కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్‌కు ప్రాధాన్యం పెరిగింది. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు భారత్‌ వైపు చూస్తున్నాయి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంలో మనవాళ్లు ముందుండటం కలిసొచ్చే అంశం. చాలామంది ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కొవిడ్‌-19 బారిన పడడంతో మొదట్లో ఇబ్బందులు ఎదురైనా,  మళ్లీ పరిస్థితులు కుదుట పడ్డాయి. ఐటీ సంస్థలు కొత్త ప్రాజెక్టులు చేజిక్కించుకోవడం డిజిటల్‌కు పెరిగిన ప్రాధాన్యం నేపథ్యంలో నిపుణులైన ఉద్యోగులను నియమించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఫలితంగా 40-50 శాతం అధిక వేతనం లభించే అవకాశాల కోసం  స్కిల్డ్ ఇంజనీర్లు  ఇతర సంస్థల వైపు చూస్తున్నారు. అందువల్లే మళ్లీ ఉద్యోగ వలసల శాతంపెరిగింది.

IT Company jobs
కరోనా మొదటి దశ ఆరంభం కాగానే, ‘ఇంటి నుంచి పని’కి ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు అవకాశం ఇవ్వడంతో, ఈ రంగం వృద్ధి ఆగలేదు. 2020-21లో హైదరాబాద్‌ ఐటీ రంగం రూ.1.45లక్షల కోట్ల టర్నోవర్‌ సాధించింది. కొవిడ్‌ తొలి రోజుల్లో ఐటీ ఉద్యోగులు సంస్థలు మారేందుకు ఇష్టపడలేదు. కానీ, అంచనాలకు మించి ప్రాజెక్టులు రావడంతో, ఐటీ సంస్థలు కొత్తగా ఉద్యోగులను నియమించుకోవడం ప్రారంభించాయి.

2020-21లో హైదరాబాద్‌ ఐటీ రంగం దాదాపు 47,000 కొత్త ఉద్యోగాలను సృష్టించిందని అంచనా. క్యాంపస్ పోస్టింగ్స్ తో పాటు, స్కిల్డ్ వర్కర్స్ ని నియమించుకునేందుకు ఐటీ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ప్రత్యేక నైపుణ్యాలలో అనుభవం కూడా ఉంటే, 100శాతం వేతనం అధికంగా ఇచ్చేందుకూ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఫలితంగా ఆగస్టులో 18-19 శాతంగా ఉన్న వలసలు, ఇప్పుడు 23శాతానికి మించాయి.