ప్రపంచంలోనే అగ్ర కుబేరులు మస్క్‌- జెఫ్ బెజోస్‌ మధ్య ట్విట్టర్‌ యుద్ధం!

Jeff bezoes coments on elon musk

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ అనుకున్నట్లుగానే సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌ ట్విట్టర్‌ హస్తగతం చేసుకున్నారు. మస్క్‌ ఇచ్చిన 44 బిలియన్ డాలర్ల డీల్ కు ట్విట్టర్‌ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మొదట కంపెనీలో షేర్లు కొనిన మస్క్‌ ఆ తర్వాత నో చెప్పలేని ఆఫర్ ఇచ్చి వారిపై ఒత్తిడి తెచ్చిన మస్క్‌ చివరికి అనుకున్నట్లుగా ట్విట్టర్‌ ను హస్తగతం చేసుకున్నారు. టేకోవర్ విలువ దాదాపు 44 బిలియన్ డాలర్లు కాగా షేరు కొనుగోలు ధర 54.20 డాలర్లుగా ఉంది. టేకోవర్ కోసం 46.5 బిలియన్ డాలర్లు సిద్ధం చేసుకున్నానని మస్క్‌ ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మస్క్‌ చేతికి ట్విట్టర్‌ వెల్లడంపై ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ సెటైర్లు వేశారు. ఒకవైపు చురకలు అంటిస్తూనే.. మరోవైపు ఎలాన్‌ మస్క్‌ గ్రేట్‌ అంటూ ఇరకాటంలో పెట్టారు.

ఎలాన్‌ మస్క్‌- టెస్లా కంపెనీ- చైనా మధ్య ఉన్న కొన్ని అంశాలను ట్విట్టర్‌ సంస్థ కొనుగోలుకు ముడిపెడుతూ న్యూయార్క్‌ టైమ్స్‌ రిపోర్టర్‌ పెట్టిన ఓ ట్వీట్‌ కు జెఫ్ బెజోస్‌ స్పందించారు. రిపోర్టర్‌ సంధించిన ప్రశ్నను మెచ్చుకుంటూ మరో ప్రశ్న సంధించారు. ‘చైనీస్‌ ప్రభుత్వం టౌన్‌ స్క్వేర్ పై పట్టు సాధించిందా?’ అంటూ స్పందించారు. గతంలో టౌన్‌ స్క్వేర్ తరహాలో ట్విట్టర్‌లో వాక్ స్వేచ్ఛ ఉండాలంటూ మస్క్‌ చేసిన వ్యాఖ్యకు కౌంటర్‌ వేసేలా జెఫ్‌ బెజోస్‌ ప్రశ్న వేశారు. ఆ తర్వాత ఆ ప్రశ్నకు ఆయనే సమాధానం కూడా చెప్పారు. కానీ, సమాధానం మాత్రం ఎంతో పాజిటివ్‌ గా చెప్పడం గమనార్హం.

‘ఈ ప్రశ్నకు నా సొంత సమాధానం కాదనే చెబుతాను. ట్విట్టర్‌ లో ఉండే సెన్సార్షిప్‌ అడ్డంకులు, చైనా- టెస్లా సంస్థ మధ్య ఉండే సంక్లిష్టత రెండూ ఒకటి కాకపోవచ్చు’ అంటూ జెఫ్‌ బెజోస్‌ కామెంట్‌ చేశారు. మస్క్‌ మీదన్న అక్కసు మొత్తాన్ని జెఫ్ బెజోస్‌ తన ట్వీట్‌ ద్వారా వెళ్లగక్కినట్లే కనిపించారు. కానీ, చివర్లో మాత్రం కర్ర విరగకూడదు.. పాము చావకూడదు అనే తరహాలో ఎలాన్‌ మస్క్ పై ప్రశంల వర్షం కురిపించారు. ‘ఇలాంటి సంక్లిష్ట భరిత పరిస్థితులను చక్కదిద్దడం, ఒక కొలిక్కి తేవడంలో ఎలాన్‌ మస్క్‌ ఎంతో నైపుణ్యం గల వ్యక్తి’ అంటూ ఆఖర్లో పొగడ్తలు గుప్పించారు. అయితే ఇంకా బెజోస్‌ ట్వీట్లపై ఎలాన్‌ స్పందించలేదు. జెఫ్‌ బెజోస్‌- ఎలాన్‌ మస్క్‌పై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.