ఎవరీ జాక్ మా!?. ఇప్పుడు ఎక్కడ అతని చిరునామా?..

ప్రపంచంలో అపర కుబేరులు ఒకరు ఆసియాలోనే అతి పెద్ద కుబేరుడిగా పేరుగాంచిన ఆలీబాబా కంపెనీ వ్యవస్థాపకుడు చైనాకు చెందిన జాక్ మా జాడ కొన్ని నెలలుగా కనిపించడం లేదు. అలీబాబా ‘మాలిక్’ జాక్ మా అదృశ్యం వార్త ప్రపంచదేశాల్లో సంచలనం సృష్టిస్తాజోంది. చైనీస్ బిలియనీర్ అయిన జాక్ మా అసలు అదృశ్యం కాలేదని, హాంగ్ జౌ లోని తన సొంత కార్యాలయంలో ఎవరికీ అందుబాటులోకి రాకుండా ఉన్నా రని సీ ఎన్ బీసీ వెల్లడించింది.  అసలు ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లాడా లేక తీవ్ర అస్వస్థతకు గానీ, కరోనా వైరస్ పాజిటివ్ కి గానీ గురయ్యాడా అన్నది తెలియడంలేదు.

Jack maa

చైనాకి చెందిన బిలియనీర్లలో ఒకరైన జాక్ మా సాధారణ స్థాయి నుంచి కుబేరుడిగా ఎదిగారు. 1964 లో చైనాలోని హాంగ్జౌ లో పుట్టిన జాక్ మా చిన్న వయసులోనే గైడ్ గా మారి విదేశీ యాత్రికులకు అక్కడి వింతలు, విశేషాలు చూపించేవారు. విదేశీ యాత్రికులుండే ఫైవ్ స్టార్ హోటల్ దగ్గరికి వెళ్లి వారికి నగరం చూపిస్తానని దీనికి బదులుగా డబ్బులు అడగకుండా కేవలం ఇంగ్లిష్ నేర్పించమని కోరేవారట జాక్ మా. ఆ తర్వాత 30 కి పైగా ఉద్యోగాలకు అప్లై చేసినా ప్రతి చోటా తిరస్కరణే ఎదురైందట. ఇంగ్లిష్ టీచర్ గా పాఠాలు చెప్పి నెలకు కేవలం పదిహేను డాలర్లు జీతంగా పొందేవారట జాక్ మా.

తన స్నేహితులతో కలిసి ఓ ట్రాన్స్ లేషన్ కంపెనీని కూడా ప్రారంభించారట. ఎన్నో వ్యాపారాలు ప్రారంభించి విజయవంతమయ్యారు. చైనా పేజెస్ అంటూ ఓ ఎల్లో పేజెస్ వెబ్ సైట్ ని ప్రారంభించారు. అప్పటినుంచి జాక్ మా సక్సెస్‌కి పర్యాయపదంగా మారిపోయారు. అక్కడి నుంచి తన వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రారంభించారు జాక్ మా. తన స్నేహితులు, భార్య సహకారంతో 1999లో అలీబాబా గ్రూప్‌ని ప్రారంభించారు. దీనికి చైనా ప్రభుత్వం కూడా ఆయనకు ఎంతగానో సహకరించింది.

గతేడాది పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్టోబర్ లో చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల్లా వ్యవహరిస్తున్నాయని జాక్ మా చేసిన విమర్శను అక్కడి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. యాంట్ గ్రూప్ సంస్థలను కూడా టార్గెట్ చేసింది. ఆ సంస్థ ఐపీఓని అడ్డుకుంది. దీంతో అలీబాబా గ్రూప్ ఛైర్మన్ బాధ్యతల నుంచి జాక్ మా తప్పుకున్నారు. జాక్ మా కూడా చైనా అధికార పార్టీకి నిధుల విషయంలో ఇతరత్రా విషయాల్లో సాయం చేశారు. మరి, ఇంత సన్నిహితంగా ఉన్న జాక్ మాకి వ్యతిరేకంగా చైనా ఎందుకంత కక్ష కట్టింది అన్న సందేహం మనందరికీ రావచ్చు. ప్రపంచమంతా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో పడ్డారు. దీంతో పాటు మీడియా వ్యాపార రంగంలో విస్తరిస్తూ పోయారు.

ఇది చూసి చైనా సర్కార్ ఆందోళనలో పడింది. ఎప్పటికైనా జాక్ మా మీడియా శక్తితో ప్రజలందరి అభిప్రాయాలను ప్రభావితం చేయగలరని భావించి ఆయనను తొక్కేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.  చైనా కుబేరుల్లో మొదటిస్థానంలో ఉన్న జాక్ మా చైనా ప్రభుత్వం చర్యల వల్ల తన స్థానాన్ని ఇటీవలే కోల్పోయారు. ఏడాది క్రితం తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన ఆలీబాబా మరియు యాంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా ఇప్పుడు చైనా కుబేరుల జాబితాలో నాలుగో స్థానానికి పడిపోయారు. జాక్ మా పబ్లిక్ లో  కనిబడింది జనవరిలో అనీ, వీడియో సమావేశంలో కనబడింది మాత్రం ఫిబ్రవరిలో అని అందరూ అనుకుంటున్నారు. ఇందులో నిజానిజాలు ఎన్నో కాలమే నిర్ణయించాలి. జాక్ మా ఆచూకీ పై రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. మరోపక్క చైనా నియంతృత్వ విధానాలు దీనికి తార్కాణంగా నిలుస్తూ ఉన్నాయని తెలుస్తోంది.