మెట్టు దిగిన ఫేస్ బుక్ గూగుల్… స్పందించని ట్విట్ట‌ర్!.

సామాజిక, డిజిటల్‌ మాధ్యమాల్లోని కంటెంట్‌ను నియంత్రించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ‘కోడ్‌ ఆఫ్‌ ఎథిక్స్‌’ పేరిట కొన్ని నిబంధనలు తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. కాగా.. వీటిని అమ‌లు చేయ‌డానికి కేంద్రం ఆయా సంస్థ‌ల‌కు మూడు నెల‌ల  గ‌డువు  ముగిసింది. కొత్త ఐటీ నియ‌మ నిబంధ‌న‌లు పాటించ‌డానికి దిగ్గ‌జ సామాజిక సంస్థ‌లు ఫేస్‌బుక్‌, గూగుల్‌లు సూత్ర‌పాయంగా అంగీక‌రించాయి. వీటి అమ‌లు చేయ‌డానికి క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించాయి.   ట్విట్ట‌ర్ నుంచి మాత్రం దీనిపై ఎటువంటి స్పంద‌న లేదు.   ఈ మధ్యకాలంలో కేంద్రంతో తరచూ వివాదాలను ఎదుర్కొంటున్న ట్విటర్‌ మాత్రం  ఇంకా ఎలాంటి స్పందన తెలపకపోవటం గమనార్హం. దేశీయ, అంతర్జాతీయ వాణిజ్య మండళ్ళు ఈ నిబంధనల అమలును ఏడాదిపాటు వాయిదా వేయాలని కోరినా ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు.  ఫేస్‌బుక్‌లో ఎవరైనా అభ్యంతరకరమైన సమాచారం పెడితే దాన్ని తమ వేదికపై ప్రచారం చేసినా ఫేస్‌బుక్‌కు ఏమీ కాలేదు.   పోస్టు పెట్టినవారిపై క్రిమినల్‌ లేదా ఇతరత్రా చర్యలకు ఆస్కారం ఉండేది. ఫేస్‌బుక్‌కు ఆ రక్షణ దొరకటానికి కారణం- మధ్యవర్తి హోదా.  ప్రభుత్వం ప్రకటించిన కొత్త నిబంధనలను అనుసరించకుంటే ఆ హోదాను ఫేస్‌బుక్‌ కోల్పోయి క్రిమినల్‌ కేసులు, ఇతరత్రా చర్యలు ఎదుర్కోవటానికి ఆస్కారం ఏర్పడుతుంది.

google fb
సామాజిక వేదికలకు భారత ప్రభుత్వం విధించిన నిబంధనలను అమలు చేయటమే తమ లక్ష్యమని  ఫేస్‌బుక్‌ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ నిబంధనలను అమలు చేసే ప్రక్రియపై కసరత్తు కొనసాగిస్తున్నట్లు తెలిపింది.  నిబంధనలు అమలు చేసే ప్రక్రియపై కసరత్తు చేస్తున్నాం. మా సామర్థ్యాలను మెరుగు పర్చుకుంటాం.  కొన్ని అంశాలపై మరింత భాగస్వామ్యం కోసం భారత ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తాం. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ భావాలు వ్యక్తంజేసుకునేందుకు వేదికగా నిలిచేందుకు మేం కట్టుబడి ఉంటామని  ఫేస్‌బుక్‌ పేర్కొనటం గమనార్హం.   మరోవైపు గూగుల్‌ నేరుగా చెప్పకుండా మా కంపెనీ ఉత్పత్తుల్లో మార్పులు తెస్తున్నాం. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను అడ్డుకోవటానికి  ఆయా దేశాల చట్టాలను అనుసరిస్తూ వనరులను, సిబ్బందిని సమర్థంగా వినియోగిస్తున్నామని పేర్కొంది. మరోవైపు  ట్విటర్‌కు పోటీగా వచ్చిన కొత్త మాధ్యమానికి గతవారమే తాము భారత ప్రభుత్వం విధించిన నిబంధనలన్నీ పాటించే వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం కూ-కు 60 లక్షల మంది వినియోగదారులున్నారు.