ఇచ్చట మాస్క్ ధరించి బిల్లు ఆర్డరిస్తే ”సర్ చార్జ్” అదనం!..

ఎవరైనా ఆర్డర్ చేసేటపుడు మాస్క్ ధరిస్తే 5 డాలర్లు టీకా తీసుకున్న విషయాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటే మరో ఐదు డాలర్ల ఫైన్ విధించబడును’ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న ఫిడిల్‌హెడ్స్ కేఫ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న నోటీస్ బోర్డ్ ఇది. కరోనా కట్టడిలో భాగంగా ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాలి. లేదంటే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తున్నారు. ఇది ప్రస్తుతం అంతటా కామన్ గా జరిగేది. అయితే ఓ కేఫ్‌లో మాత్రం మాస్క్‌ ధరిస్తే భారీగా జరిమానా విధిస్తున్నారు. ఈ వింతైన రూల్ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో జరిగింది. ఫిడిల్‌హెడ్స్‌ కేఫ్‌లో మాస్క్‌ ధరిస్తే ఆ యజమాని ఐదు డాలర్ల జరిమానా విధిస్తున్నారు. ఇదే విషయాన్ని తెలుపుతూ కస్టమర్లకు గమనిక అంటూ కేఫ్ గోడలపై బోర్డు ఏర్పాటు చేశాడు. ఇటీవల అమెరికాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం వ్యాక్సినేషన్‌ వేగవంతం కావడంతో ఇకపై మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదని ఆ దేశాధ్యక్షుడు బైడెన్‌ ప్రకటించారు.

అమెరికాలో మాస్క్‌ ధరించాల్సిన అవసరం లేకున్నా చాలా మంది కరోనా వ్యాప్తికి భయపడి మాస్క్‌లు ధరించే రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది రెస్టారెంట్‌లో అదనంగా 5 డాలర్లు చెల్లించడానికైనా సిద్ధపడుతున్నారు గానీ మాస్క్‌ తీసేయడానికి ససేమిరా అంటున్నారు. దీంతో రెస్టారెంట్‌లో బిల్లుపై అదనంగా 5 డాలర్లు చొప్పున బాగానే వసూలవుతున్నాయి. అయితే, ఇలా వసూలైన నగదును స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వనున్నట్లు ఆ రెస్టారెంట్‌ యజమాని క్రిస్‌ కాస్టిల్‌మ్యాన్‌ వెల్లడించారు. స్వచ్ఛంద సంస్థకు చేయూత ఇవ్వడం కోసం కస్టమర్ల నుంచి 5 డాలర్లు ఈ విధంగా వసూలు చేయడం తన దృష్టిలో తప్పు కాదని క్రిస్‌ చెప్పుకొచ్చాడు.