తెలంగాణ ఎమ్మెల్యే సీతక్కకు ధ్యాంక్స్ చెప్పిన హీరో సూర్య

హైదరాబాద్-చెన్నై- జై భీమ్.. తమిళ హీరో సూర్య నటించిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలుసిందే. దళితులు, సంచార జాతులపై పోలీసుల దాడులు, అరాచకాలను జై భీమ్ మూవీలో కళ్లకు కట్టినట్లు చూపించారు. తన భర్త కోసం ఓ పేద దళిత మహిళ పోరాటాన్ని సహజసిద్దంగా తెరకెక్కించిన జై భీమ్ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది.

జస్టిస్ చంద్రు జీవితంలోని ఓ యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిన జై భీమ్ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. చట్టం ముసుగులో జరిగే అన్యాయాలకు బలికాకుండా, న్యాయస్థానాలపై నమ్మకం పెరిగేలా రూపొందించిన జై భీమ్ సినిమాపై వివిధ రంగాల ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాలో నటించిన తమిళ హీరో సూర్యకు, నటీ నటులకు ప్రముఖులు అభినందనలు చెబుతున్నారు.

jai bhim seethakka 1

ఇదిగో ఈ క్రమంలోనే తెలంగాణలోని ములుగు ఎమ్మెల్యే, అఖిలభారత కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యదర్శి, మాజీ మావోయిస్ట్ సితక్క అలియాస్ అనసూయ జై భీమ్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా తప్పకుండా ఆస్కార్ అవార్డు సాధిస్తుందన్న నమ్మకం తనకుందని చెప్పారు సీతక్క. అందుకు. జై భీమ్ సినిమా టీమ్‌ కి ముందస్తు శుభాకాంక్షలు అంటూ సీతక్క ట్వీట్ చేశారు.

ఎమ్మెల్యే సీతక్క ట్వీట్‌ కి హీరో సూర్య స్పందించారు. ఆమె ట్వీట్‌ కి సూర్య రిప్లై ఇచ్చారు. థాంక్యూ మేడం.. మా టీం అందరి తరఫున థాంక్యూ అని రీ ట్వీట్ చేశారు సూర్య. ఐతే జై భీమ్ సినిమాలో ఓ వర్గాన్ని కించపరిచారని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. అభ్యంతరకరమైన దృష్యాలను తొలగించాలని డిమాండ్ కూడా చేస్తున్నారు.