18 ఏళ్లు నిండి స్మార్ట్ ఫోన్ లేని వారికి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

నేషనల్ డెస్క్- భారత్ లో కరోనా కేసులు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. కరోనా నుంచి రక్షించుకునేందుు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐతే దేశంలో అందరికి సరిపడా వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో అతి కొద్ది మందికి మాత్రమే వ్యాక్సిన్ దొరుకుతోంది. ఇంకా కోట్లాది మంది వకరోనా టీకా కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు వ్యాక్సిన్ కోసం ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండటం కూడా చాలా మందికి ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే భారత్ లో ఇప్పటికీ కోట్లాది మంది దగ్గర స్మార్ట్ ఫోన్ లేదంటే అతియోశక్తి కాదు. దీంతో వారంతా వ్యాక్సిన్ కోసం ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.

vaccine

ఇలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఓ వెసులుబాటు కల్పించింది. 18 ఏళ్లు నిండి ఇంటర్నెట్ సౌకర్యం, స్మార్ట్‌ ఫోన్లు లేని వారికి కేంద్రం ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇలాంటి వారు ఇక వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని మోదీ సర్కార్ స్పష్టం చేసింది. ఇలా 18 ఏళ్లు నిండి, స్మార్ట్ ఫోన్ లు లేనివారంతా నేరుగా వ్యాక్సిన్ కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. అలా వ్యాక్సినేషన్ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిలో టీకా అందుబాటులో ఉంటే కొందరికి ఆ రోజే వ్యాక్సిన్ ఇస్తారని ప్రభుత్వం తెలిపింది.

అయితే ఇలా అప్పటికప్పుడు వ్యాక్సిన్ కేంద్రాల్లోనే టీకా రిజస్ట్రేషన్లకు అనుమతించే విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రాల్లో కరోనా టీకా నిల్వలు, అక్కడి పరిస్థితుల ఆధారంగా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. ఐతే ప్రైవేటు ఆసుపత్రుల విషయంలో ఈ వెసులుబాటు వర్తించదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అందుకని ఎవరికైతే 18 ఏళ్లు నిండి, స్మార్ట్ ఫోన్ లు లేవో వారంతా నేరుగా ప్రభుత్వ టీకా సెంటర్లకు వెళ్లి వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్లు చేసుకోండి మరి.