బంపర్ ఆఫర్.. బిర్యానీ కొంటే 2 తులాల బంగారం

హైదరాబాద్- వ్యాపారం ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు. వినియోగదారులను, కస్టమర్లను ఆకట్టుకునేందుకు చాలా జిమ్మిక్కులు చేస్తుంటారు. కొంత మంది వ్యాపారులు కస్టమర్లను ఆకర్షించేందుకు రకరకాల స్కీములను కూడా పెడుతుంటారు. ఏంచేసినా వ్యాపారాన్ని అభివృద్ది చేసుకోవడమే ప్రధాన లక్ష్యమనుకొండి. ఇదిగో హైదరాబాద్ లో ఓ హోటల్ యజమాని కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు.

హైదరాబాద్ మియాపూర్‌ లోని హోటల్ రేణు గ్రాండ్ నిర్వాహకులు సరికొత్త స్కీమ్ ను తీసుకువచ్చారు. తమ హోటల్ లో బిర్యానీ సేల్స్ పెంచుకునేందుకు ఏకంగా బంగారం ఆఫర్ ప్రకటించారు. కేవలం 99 రూపాయలతో బిర్యానీ కొనుగోలు చేసిన కస్టమర్లకు ఓ లక్కీ కూపన్ అందిస్తున్నారు. బిర్యానీ కొనుగోలు చేసిన వారు లక్కీ కూపన్ నింపి హోటల్ లో ఏర్పాటు చేసిన డ్రా బాక్సులో వేయాల్సి ఉంటుంది.

Hotel 1

లక్కీ డ్రాలో గెలిచిన వారికి మొదటి బహుమతిగా రెండు తులాల బంగారు నాణేలు అందిస్తారట. ఇక రెండో బహుమతిగా కిలో వెండి, మూడో బహుమతిగా యాపిల్ ఐఫోన్ ఇస్తామని స్కీమ్ లో భాగంగా ప్రకటించారు. కరోనా నేపధ్యంలో లాక్‌ డౌన్ సమయంలో హోటల్ వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయామని, అందుకే ఇప్పుడు కస్టమర్ల కోసం ఈ స్పెషల్ ఆఫర్‌ ను ప్రకటించినట్లు రేణు గ్రాండ్ హోటల్ మేనేజ్‌మెంట్ తెలిపింది.

ఐతే హోటల్ లో తిన్నవారికి ఆ ఆఫర్ వర్తించదు, కేవలం పార్సిల్ తీసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందట. బిర్యానీని కేవలం 99 రూపాయలకే అందించినా, క్వాలిటీ, టేస్ట్ విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదని హోటల్ యజమాన్యం తెలిపింది. ఇక లక్కీ డ్రాను జనవరి 1, 2022 నాడు తీస్తామని రెస్టారెంట్ నిర్వాహకులు స్పష్టం చేశారు. ఇంకేముంది బిర్యాని కోసం కస్టమర్లు ఈ హోటల్ ముందు క్యూ కట్టారు.