న్యూ ఢిల్లీ- నరేంద్ర మోదీ సర్కార్ పేద, సామాన్య ప్రజలకు మరిన్ని ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే రేషన్ షాపుల ద్వార నిత్యావసర వస్తువులను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ఎల్పీజీ సిలిండర్లను సైతం రేషన్ షాపుల ద్వార సరఫరా చేయాలని నిర్ణయించింది.
ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా రేషన్ షాపుల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖకు ఎల్‌పీజీ సర్వీసుల అంశానికి సంబంధించి రేషన్ డీలర్లు దరఖాస్తు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశానికి సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని ఆల్ ఇండియా ఫెయిల్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ నేషనల్ జనరల్ సెక్రటరీ విశ్వాంబర్ బసు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా విక్రయించే సిలిండర్ల ధరను మాత్రం ఇంకా నిర్ణయించలేదు. ప్రస్తుతం 5 కేజీల సిలిండర్ ధర 350 నుంచి ప్రారంభం అవుతోంది. అదే 10 కేజీల సిలిండర్ అయితే 635 చెల్లించాల్సి ఉంటుంది. ఐతే ప్రస్తుతం కేవలం 5 కేజీల సిలిండర్లు మాత్రమే రేషన్ షాపుల ద్వార సరఫరా చేయాలని కేేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఐఓసీ.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అందిస్తున్న కాంపొసైట్ ఎల్‌పీజీ సిలిండర్లు ఉపయోగించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందొచ్చు. ఈ సిలిండర్లు తుప్పు పట్టవు. అంతేకాదు వీటి బరువు కూడా తక్కువగానే ఉంటాయి. సాధారణ ఐరన్ సిలిండర్లతో పోలిస్తే వీటి బరువు దాదాపు సగమే ఉంటుంది. గ్యాస్ వినియోగదారులు వారి డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఈ సిలిండర్లు పొందొచ్చు.