ఇక లాక్ డౌన్ ను పొడగించవద్దు.. కేసీఆర్ కు ఓవైసీ సూచన

cm ckr

హైదరాబాద్- తెలంగాణలో లాక్ డౌన్‌ పొడగింపుపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఈనెల 12 నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. లాక్ డౌన్ నేపధ్యంలో రాష్ట్రంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నారు. ఈ నాలుగు గంటలు మాత్రమే ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులను కొనుక్కోవాలి. ఆ తరువాత మళ్లీ ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. ఇక ఈరోజుతో లాక్ డౌన్ గడువు ముగుస్తుంది. దీంతో లాక్ డౌన్ పొడగింపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్ష్యతన జరిగే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

owaisi

ఇటువంటి సమయంలో ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రాష్ట్రంలో లాక్ డౌన్ విధింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాను ఎదుర్కోవడానికి లాక్ డౌన్ ఒక్కటే మార్గం కాదని ఆయన వ్యాఖ్యానించారు. లాక్ డౌన్‌తో అనేక మంది పేదలు ఇబ్బందులు పడుతున్నారని అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. లాక్ డౌన్ నుంచి కేవలం నాలుగు గంటలు మాత్రమే మినహాయింపు ఇస్తే నిరు పేదలు ఎలా బతుకుతారని ఓవైసీ ప్రశ్నించారు. లాక్ డౌన్ విధించకుండా ఇతర మార్గాలను అనుసరించడం ద్వార కూడా కరోనాపై పోరాడ వచ్చని అసదుధ్దీన్ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా కరోనాపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు.

మాస్క్ వాడకం, సామాజిక దూరం పాటించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఓవైసీ చెప్పారు. యూనివర్సల్ వ్యాక్సిన్ మాత్రమే దీనికి దీర్ఘకాలిక పరిష్కారమన్న అసదుధ్దీన్. ఇప్పుడు రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం వల్ల లాక్ డౌన్ ను పొగించాల్సిన అవసరం ఏ మాత్రం లేదని అన్నారు. ఐతే కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ మాత్రం మినీ లాక్ డౌన్ పెట్టాలని కేసీఆర్ సర్కార్ కు సూచించారు ఓవైసీ. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కోట్ చేస్తూ ట్వీట్ చేశారు హైదరాబాద్ ఎంపీ అసదుద్ధీన్ ఓవైసీ. మరి ఓవైసీ సూచనను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది.