కర్నూలు జిల్లా పంట పొలాల్లో వజ్రాలు లభ్యం! ఆనందంలో రైతులు!

ఎప్పుడైనా రోడ్ మీద డబ్బులు దొరికితే మన అదృష్టం బాగుందని మురిసిపోతాం. అదే బంగారం చిక్కితే ఆ ఆనందం మాటల్లో చెప్పలేము. కానీ.., ఇలానే వజ్రాలు దొరికితే..? వజ్రాలు దొరకడం ఏంటి? అసలు ఇది ఎలా సాధ్యం అవుతుంది అంటారా? ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఇదే జరుగుతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో రైతులకి వజ్రాలు లభిస్తున్నాయి. పొలం పనులకు వెళ్లిన రైతులకు ఈ వజ్రాలు దొరికాయన్న వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓ రైతుకి దొరికిన ఒక వజ్రాన్ని అదే గ్రామానికి చెందిన వజ్రాల వ్యాపారి రూ.70 వేలకు కొనుగోలు చేయగా, ఇంకో వ్యక్తికి దొరికిన మరో వజ్రాన్ని మద్దికెర మండలం పెరవలి గ్రామానికి చెందిన వ్యాపారి రూ.40 వేలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. గురువారం ఇదే గ్రామంలోని ఓ రైతుకు పొలంలో రూ.1.2 కోట్ల విలువైన వజ్రం దొరికినట్లు వార్తలు వెలువడ్డాయి. రెండు రోజుల వ్యవధిలో మూడు వజ్రాలు లభ్యమవడంతో జనం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పొలాల్లో వాలి పోయారు. నిజానికి ఈ ప్రాంతంలో ఇలా వజ్రాలు లభించడం ఇదే మొదటిసారి కాదు. ఏటా తొలకరి వర్షాలకు ఈ ప్రాంతంలో చిన్నా పెద్దా కలిపి 50 దాకా వజ్రాలు లభ్యమవుతుంటాయి.

vajralu 2ప్రతి ఏటా తొలకరి వానలు కురవగానే ఈ ప్రాంతంలో వజ్రాన్వేషణ కొనసాగుతుంది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి కూడా జనం ఇక్కడి వచ్చి వజ్రాన్వేషణ చేస్తుంటారు. కొందరు రెండు మూడు నెలల పాటు ఇక్కడే ఉంటూ వెతుకుతారు. పొలం పనులు చేసే సమయంలోనూ కూలీలకి వజ్రాలు దొరుకుతుంటాయి. తెలుపు, ఎరుపు, తేనె వర్ణం వంటి రంగులలో వజ్రాలు లభిస్తుంటాయి. రూ.2వేల నుంచి లక్షల విలువ చేసే వజ్రాలు ఏటా దాదాపు 20 నుంచి 50కి పైగా దొరుకుతుంటాయి. ఇక్కడ వజ్రాలు దొరికినా.., ఎవరికి దొరికాయి, వారు ఎవరికి అమ్మారు వంటి వివరాలు బయటకి రావు. దొరికిన వజ్రాలను కొందరు గుట్టుగా అమ్ముకుంటారు. మరికొందరు ధర నచ్చక పోతే టెండరు పద్ధతిలో అమ్ముతారు. వజ్రాలను కొనుగోలు చేసిన వ్యాపారులు ముంబయి, చెన్నై, బెంగళూరు తదితర రాష్ట్రాల్లో అమ్ముతారు. క్యారెట్ల రూపంలో లెక్కించి వజ్రాలను కొనుగోలు చేస్తారు. ఒక్కోసారి వ్యాపారులు కుమ్మక్కై వజ్రాలను తక్కువ ధరకే కొనుగోలు చేస్తారు. దాని విలువ ఎవరికీ తెలియక పోవడంతో ఒక్కోసారి వజ్రం దొరికిన వారు మోస పోతుంటారు. ఇప్పటికైనా.., ఇక్కడ వజ్రాలు ఎందుకు దొరుకుతున్నాయి? ఆ వజ్రాలు ఎలా దొంగ మార్గంలో మార్కెట్ లోకి వెళ్తున్నాయనే విషయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.