19 ఏళ్లకే యువతి కోరుకున్న కానిస్టేబుల్ ఉద్యోగం.. సంబరపడేలోపే..!

Krishna Dist Ap

యువతి తల్లిదండ్రుల సాయంతో కష్టపడి ఉన్నత చదువులు చదివింది. చిన్న వయసులోనే చదువులో ఆరితేరి 19 ఏళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించి ఔరా అనిపించింది. దీంతో తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులంతా సంతోషం వ్యక్తం చేశారు. ఇక కొన్నాళ్లు గడవడంతో తల్లిదండ్రులు కూతురు పెళ్లికి నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇంకా పెళ్లికి పది రోజుల సమయం ఉంది అంతలోనే ఆ యువతిని మృత్యువు కాటేయడంతో సొంత గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం నందమూరి గ్రామానికి చెందిన పరసా శ్రీరమ(21) అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఉద్యోగంలో కూడా మంచి పేరును తెచ్చుకుంది. ఇక పెళ్లికి తల్లిదండ్రులు నిర్ణయం తీసుకుని తెలిసిన వ్యక్తుల్లోని ఓ అబ్బాయితో నిశ్చాతార్థం కూడా కుదుర్చారు. ఇక పెళ్లికి 10 రోజుల సమయం ఉండడంతో అన్ని ఏర్పాట్లు చకచక పూర్తి చేస్తున్నారు. అంతలోనే ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

గత వారం రోజుల కిందట నుంచి శ్రీరమ ఆరోగ్య పరిస్థితుల్లో ఏదో తేడా అనిపించింది. దీంతో వెంటనే వైద్యులను సంప్రదించింది. అన్ని పరీక్షలు చేసిన అనంతరం వైద్యులు శ్రీరమకు క్యాన్సర్ ఉందంటూ తెలియజేశారు. దీంతో కుటుంబ సభ్యులంతా షాక్ కు గురయ్యారు. ఇక పెళ్లికి కొద్ది రోజులే సమయం ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. ఇక గత బుధవారం రోజు విధుల్లో ఉన్న శ్రీరమ ముక్కు నుంచి రక్తం రావడం మొదలై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

దీంతో వెంటనే స్పందించిన అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇక మెరుగైన వైద్యం కోసమని హుటాహుటిన హైదరాబాద్ కు తరలించి చికిత్స అందించారు. ఇక రెండు రోజుల పాటు శ్రీరమ చికత్స పొందుతూ గురువారం అర్థరాత్రి కన్నుమూసింది. చిన్న వయసులోనే ఉద్యోగం సాధించి మరణించటంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల కృష్ణాజిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది.