ట్రాన్స్ జెండర్ దీపిక అలియాస్ తిలక్ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే మొదట్లో ఈ హత్య కేసును అనుమానాస్పద కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గత వారం రోజులుగా మిస్టరీగా ఉన్న దీపిక హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు చేదించారు. ఆమెతో చనువుగా ఉండే సాయి హర్షనే దీపికను కొట్టి చంపినట్లుగా పోలీసులు విచారణలో తెలింది. ఇదే విషయాన్ని తాజాగా పోలీసులు మీడియాకు తెలిపారు. అసలేం జరిగిందంటే?
దీపిక అలియాస్ తిలక్ (26) ఒక ట్రాన్స్ జెండర్. హైదరాబాద్ లోని అంబర్ పేటలో నివాసం ఉంటూ ప్రతీ ఏటా జరిగే బోనాల ఉత్సవాల్లో పాల్గొంటుంది. అయితే తద్వారా వచ్చే డబ్బుతో తన జీవనాన్ని కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే ఆమెకు ఎల్బీనగర్ నాగోల్ ప్రాంతానికి చెందిన సాయి హర్ష అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతోనే సాయి హర్ష దీపిక ఆర్థిక అంశాలను చూసుకుంటూ ఉండేవాడు. ఇక కొంత కాలం తర్వాత సాయి హర్షకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని.., దీపిక వద్ద లక్షన్నర అప్పుగా తీసుకున్నాడు. ఇక చాలా రోజులు కావడంతో దీపిక సాయి హర్షను ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని పట్టుబట్టింది.
పదే పదే అడగడంతో సాయి హర్షకు కోపం వచ్చింది. దీంతో ఎలాగైన దీపికను లేకుండా చేయాలని భావించాడు. ఇందులో భాగంగానే ఈ నెల 21న సంగారెడ్డిలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో దీపిక ఇద్దరు ముగ్గురితో కలిసి అక్కడికి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న సాయి హర్ష సంగారెడ్డిలో ఉన్న దీపిక వద్దకు వెళ్లాడు. ఇక హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతూ సాయి హర్ష అతని ప్రెండ్ తో పాటు దీపికను కూడా తన కారులో ఎక్కించున్నాడు. హైదరాబాద్ కు వచ్చే మార్గమధ్యలో కొండాపూర్ వద్ద ఆగి ఓ వైన్ షాపు వద్ద అందరూ మద్యం సేవించారు.
సాయి హర్ష పథకం ప్రకారం.. దీపికను పీకలదాక మద్యం తాగించాడు. ఇక ఇదే సమయాన్ని అదునుగా భావించిన సాయి హర్ష అదే కారులో దీపికపై తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ దీపకను సాయి హర్ష ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఏం చేయాలో అర్థంకాని సాయి హర్ష దీపికకు ఫిడ్స్ వచ్చి మరణించిందని ఆమె తల్లిదండ్రులకు కబురు పంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించగా ఎట్టకేలకు సాయి హర్షనే దీపికను హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇదే విషయాన్ని తాజాగా పోలీసులు మీడియాకు తెలిపారు. గత వారం రోజులుగా ఈ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.