ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే – బిల్లు చూస్తే గు”భిల్లు”మనడం ఖాయం…

హైద‌రాబాద్ నగరంలో లాక్‌డౌన్ కార‌ణంగా మ‌ధ్యాహ్నం నుంచి రెస్టారెంట్లు, హోటళ్లు బంద్ అవుతుండ‌డంతో చాలా మంది ఫుడ్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేసుకుని ఇంటికి తెప్పించుకుని తింటున్నారు. దీంతో రెస్టారెంట్లు ఆన్‌లైన్ ఆర్డర్లపై అదనంగా పన్నులు వేస్తూ వినియోగ‌దారుల నుంచి దోపిడీ చేస్తున్నాయి. కొత్త‌గా హ్యాండ్లింగ్, ప్యాకేజింగ్‌ ఛార్జీ, పన్నులు, ప్యాకింగ్ చార్జిలు, డెలివరీ చార్జీల పేరుతో దాదాపు రూ.60 నుంచి రూ.100 అదనంగా వసూలు చేస్తున్నాయి. అంతేకాదు ధరల విషయంలోనూ గోల్ మాల్ చేస్తున్నాయి. రెస్టారెంట్ వద్ద ఒక రేటు ఉంటే యాప్‌లో మరో రేటు పేర్కొంటున్నాయి. ఐతే డిస్కౌంట్ల పేరుతో ఆహార ప్రియులను ఆకర్షించి బురిడీ కొట్టిస్తున్నాయి. పెంచిన రేటు విషయం వారికి తెలియదు. డిస్కౌంట్ మాత్రమే కనిపిస్తుంది. ఇలా చాలా మంది మోసపోతున్నారు.

mobile ordering fraud security 1000x600 1

ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోని ఓ రెస్టారెంటుకు దోపిడీపై ఓ క‌స్ట‌మ‌ర్ ఫిర్యాదు చేయ‌గా, ఆ రెస్టారెంటుకు రూ.10వేల జరిమానా విధించి, కేసు ఖర్చుల కింద వినియోగ‌దారుడికి అద‌నంగా మ‌రో రూ.5 వేలు చెల్లించాలని ఫోరం చెప్పింది. అంతేగాక‌ నష్ట పరిహారం కింద వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.50వేలు చెల్లించాలని ఆదేశించింది. సింగిల్ బిర్యానీ ప్యాకెట్ ధర రూ.180. కానీ అదే రెస్టారెంట్లో అదే బిర్యానీ ఫుడ్ డెలివరీ యాప్‌లో మాత్రం రూ.250గా చూపిస్తున్నారు. దీనిపై 20 శాతం డిస్కౌంట్ అంటూ వినియోగదారులను ఊరిస్తున్నారు. డిస్కౌంట్ పోగా దాని ధర రూ.200 చూపిస్తోంది. ఏదేని ఫుడ్ డెలివరీ సంస్థ లేదా రెస్టారెంట్ ఇలాంటి మోసాలకు పాల్పడితే వినియోగదారుల మండలి లేదా తూనికలు కొలతలు, జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఫుడ్ ఆర్డర్‌పై ఆఫ్‌లైన్‌ కంటే ఆన్‌లైన్‌లో ఎక్కువ ధరలు వసూలు చేయడం, డెలివరీ ఛార్జీ వసూలు చేయడం వినియోగదారుడిని మోసం చేయడమేనని చెబుతున్నారు. దానికి రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీ సంస్థలు బాధ్యత వహించాల్సి ఉంటుంది.