సర్వర్లపై దాడి – సమాచారాన్ని తస్కరిస్తున్న సైబర్‌ నేరస్థులు!..

సైబర్‌ నేరగాళ్లు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు సంస్థలు, దుకాణాలు, ఫుడ్‌ డెలివరీ సంస్థలపై గురిపెట్టారు. ఆయా సంస్థల సర్వర్లపై చొరబడుతూ సమాచారాన్నంతా తస్కరిస్తున్నారు. వాటిని డార్క్‌నెట్‌, డీప్‌వెబ్‌ తదితర వెబ్‌సైట్లలో అమ్మేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వాటిని విక్రయిస్తున్న కొందరు ఆ వివరాల సాయంతో వినియోగదారుల నుంచి రూ.లక్షలు కొల్లగొడుతున్నారు.  ప్రజలను వినియోగ వస్తువులుగా భావిస్తున్న సైబర్‌ నేరస్థులు వారి వివరాలు సేకరించేందుకు సరైన రక్షణ వ్యవస్థలు లేని సర్వర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలు, మెట్రో నగరాల్లో ఐటీ సంస్థలకు పొరుగుసేవలు అందిస్తున్న కంపెనీలు, ఐటీ హబ్‌లున్న హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, నోయిడా వంటి నగరాల్లో 100 మందితో నడిచే చిన్నచిన్న కంపెనీల సర్వర్లను హ్యాక్‌ చేయడం ద్వారా మొత్తం సమాచారాన్ని సంగ్రహిస్తున్నారు.   మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌తోపాటు ఇన్ఫోసిస్‌ వంటి ఐటీ సంస్థల్లో మెరుగైన భద్రత వ్యవస్థలు ఉంటాయి. ఇదే తరహాలో ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు సంస్థలు ఫైర్‌వాల్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. సర్వర్లపై దాడి జరిగిందని కంపెనీలు ఫిర్యాదుచేస్తే నిందితులను పట్టుకోగలం తప్ప బహిర్గతమైన సమాచారాన్ని తిరిగితీసుకురాలేం. డేటా లీక్‌ ప్రభావం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశాలుంటాయి.

images 1

దేశ, విదేశాల్లో డిజిటల్‌ చెల్లింపులు చేస్తోన్న ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ వినియోగదారుల్లో 10 కోట్ల మంది వ్యక్తిగత వివరాలు, ఆధార్‌కార్డులు, క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వివరాలన్నీ ఏప్రిల్‌ 1, 2021న సైబర్‌ నేరస్థుల చేతిల్లోకి వెళ్లాయి. సర్వర్లను ఎవరైనా హ్యాక్‌చేస్తే డేటా దానంతటదే అదృశ్యమయ్యే వ్యవస్థ ఉందా? ఎప్పటికప్పుడు సురక్షిత ప్రమాణాలను పెంచుకుంటున్నారా? అన్న అంశాలను టెలికమ్యూనికేషన్‌, సమాచార ప్రసారశాఖలు పరిశీలించాలి. పటిష్ఠ రక్షణ వ్యవస్థ ఉన్న వాటికే అనుమతులు ఇవ్వాలి. ముఖ్యంగా దేశంలోని వినియోగదారుల సమాచారం బయటికి వెళ్లదని నిర్ధారించుకున్నాకే వాటి కార్యకలాపాలకు అనుమతించాలి. అవేమీ జరగడం లేదని, ఇదే దేశ ప్రజల వ్యక్తిగత భద్రతకు ముప్పుగా పరిణమించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.