పెళ్లి.. రెండు అక్షరాలు.. రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడడుగులు.. అని చాలా మంది నిర్వచిస్తూ ఉంటారు. ప్రస్తుతం దాంపత్యం ఓ యాంత్రిక జీవనంగా తయారైంది. అనురాగాలు కరవై.. ఆప్యాయతలకు దూరమై ఇదే అసలైన జీవితం అని అనుకుంటున్నారు. ఆలుమగలు అంటే ప్రాణాలు విడిచే వరకు ఒకరికి తోడుగా మరొకరు బ్రతకడం. అలాంటిది ఈ కాలంలో ఓ వృద్ధ దంపతులు బ్రతుకులోనే కాదు చావును కూడా కలిసే పంచుకున్నారు. మరి ఆ వృద్ధ దంపతుల మరణానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణానికి చెందిన గుడాల రాములుకు 93 సంవత్సరాలు. ప్రస్తుతం ఇతని మృతి స్థానికుల్ని తీవ్రంగా కలచి వేసింది. ఈ చావు వెనుక బలమైన కారణం ఉంది. రాములు దాంపత్య జీవితానికి అండగా నిలిచిన.. సత్తవ్వ ఆరు నెలల క్రితం అనారోగ్యానికి గురైంది. దాంతో సత్తెవ్వకు భర్త రాములే సేవలు చేశాడు. 70సంవత్సరాలకుపైగాతన కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న భార్య మంచానపడటంతో అన్నీ సపర్యలు చేస్తూ వచ్చాడు. గత శుక్రవారం సత్తవ్వ మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు శనివారం అంత్యక్రియలు పూర్తి చేశారు. రాములు, సత్తవ్వ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
ఆదివారం సత్తెవ్వను దహనం చేసిన చితి దగ్గర మూడో రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రాములు ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి రాములు మరణించాడని వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇన్ని సంవత్సరాలు తనతో కలిసి జీవించిన భార్య చనిపోవడంతో బెంగ పెట్టుకున్న రాములు.. ఆమె ఎడబాటును తట్టుకోలేకపోయాడు. అందుకే ఆమె చితి దగ్గర అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న సమయంలోనే ప్రాణాలు విడిచాడు. చావు కూడా తమను విడదీయలేదని నిరూపించాడు. ప్రాణంతో ఉన్నప్పుడు ఎంతో ఆప్యాయంగా జీవించిన తల్లిదండ్రులు చావులోనూ కలిసే ప్రాణాలు విడిచిపెట్టడాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. మరి ఈ వృద్ధ దంపతుల మరణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.