నా ముక్కుతో మీకు పనేంటి? విపక్షాలపై సీఎం కేసీఆర్ ఫైర్

హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల మాంత్రికులు. కేసీఆర్ ఏ మాట్లాడినా, ఎంత సేపు మాట్లాడినా విసుగు రాదు. ఆయన మాట తీరు అలా ఉంటుంది. చలోక్తులు, సామెతలు, విమర్శలు, తిట్లు.. అన్నీ కలిపి సీఎం కేసీఆర్ మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది అంతే. ఇక ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసీఆర్ తిట్ల దండకం మొదలుపెట్టారంటే భలే గమ్మత్తుగా ఉంటుంది.

kcr 1

తాజాగా కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి టీఆర్ ఎస్ పార్టీలో చేరిన సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన స్టైల్లో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన రూపు రేఖలపై కొందరు అవహేళన చేశారని, అయినప్పటికీ అవన్నీ పట్టించుకోకుండా తెలంగాణ కోసం ముందుకెళ్ళానని కేసీఆర్ చెప్పుకొచ్చారు. తనను తిట్టిన తిట్లు ప్రపంచంలో ఇంకెవ్వరిని తిట్టి ఉండరని అన్నారు. ఈ క్రమంలోనే తన ముక్కు గురించి ప్రస్తావించారు సీఎం కేసీఆర్.

తన ముక్కుతో వాళ్లకు పనేంటోనని కేసీఆర్ నవ్వుతూనే మండిపడ్డారు. తాను బక్కగా ఉన్నానని, తెలంగాణ ఏంసాధిస్తానని ఎక్కిరించారని, కానీ నేనే తెలంగాణ తెచ్చానని గుర్తు చేసుకున్నారు. మనిషికి పట్టుదల ఉండాలే కాని, ఏదైనా సాధించవచ్చని కేసీఆర్ అన్నారు. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో లబ్ధి కోసం దళిత బంధు పెట్టామనేది వందకు వంద శాతం నిజమని చెప్పిన ముఖ్యమంత్రి, ఎన్నికల్లో గెలవాలంటే ఖచ్చితంగా ఇలాంటి పధకాలు పెట్టాల్సిందేనని తేల్చి చెప్పారు.