ఒక్కో రైతు కుటుంబానికి 3 లక్షల రూపాయలను ప్రకటించిన కేసీఆర్

హైదరాబాద్- కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వరి ధాన్యం కొనుగోళ్లపై మోదీ సర్కార్ సరైన స్పష్టత ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో శనివారం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. వరి దాన్యం కొనుగోలుపై ఎన్నిసార్లు డిమాండ్‌ చేసినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని కేసీఆర్ ఆవేధన వ్యక్తం చేశారు.

ఇక ఆఖరి ప్రయత్నంగా ఆదివారం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలుస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. అపాయింట్ మెంట్ దొరికితే ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలుస్తామని అన్నారు. ఇక మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకోవడంపైనా కేసీఆర్ స్పందించారు. సాగు చట్టాలపై కేంద్రం క్షమాపణ చెప్తే సరిపోదన్న కేసీఆర్, రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్‌ గ్రేషియో చెల్లించాలని కేసీఆర్ కేంద్రాన్ని కోరారు.

KCR Modi 1 1

సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటంలో చనిపోయిన రైతు కుటుంబాలకు కేసీఆర్ సంఘీభావం తెలిపారు. రైతు ఆందోళనలో చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తరపున 3 లక్షలు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేసిన కేసీఆర్, వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ అంశంపై పోరాటం చేస్తామని అన్నారు. సాగు చట్టాలపై కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా జ్ఞానోదయం అయినందుకు సంతోషమని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఇక విద్యుత్ చట్టాలు తెచ్చి మీటర్లు పెట్టాలని రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్నారని కేంద్రంపై ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. విద్యుత్‌ చట్టాన్ని కూడా కేంద్రం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణా, గోదావరిలో నీటి వాటాలు తేల్చాలని కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. నీటి వాటాలు తేల్చకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. దేశంలో బీసీ ఘనను సైతం వెంటనే చేపట్టాలని కేసీఆర్ ప్రధాని మోదీని డిమండ్ చేశారు.