భార్య వియోగం దుర్భరం, ఉత్తేజ్ ను ఓదార్చిన చిరంజీవి

ఫిల్మ్ డెస్క్- జీవితంలో అన్ని విధాలుగా సెటిల్ అవుతన్న సమయంలో భార్య వియోగం అనేది చాలా దుర్భరమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. నటుడు ఉత్తేజ్ సతీమణి పద్మావతి చనిపోవడం అందరిని కలచివేసిందని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. ఉత్తేజ్‌ ఇంట కొన్ని రోజుల క్రితం తీవ్ర విషాదం నెలకొన్న సంగతి అందరికి తెలిసిందే. ఆయన సతీమణి పద్మావతి ఈ నెల 13న క్యాన్సర్ తో మృతి చెందారు.

గురువారం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో పద్మావతి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. పద్మావతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆమెకు నివాళులు అర్పించారు. చిరంజీవిని చూడగానే ఉత్తేజ్ మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. ఉత్తేజ్ ను ఓదార్చిన మెగాస్టార్, తనకు ఉత్తేజ్ కు మధ్య అనుబంధం గురించి చెప్పుకొచ్చారు.

Uttej 1

హిట్లర్ సినిమా నుంచి ఉత్తేజ్‌తో తనకు మంచి అనుబంధం ఉందని చిరంజీవి అన్నారు. పద్మావతి మృతి వార్త తెలిసి తాను ఎంతో చలించిపోయానని ఈ సందర్బంగా చెప్పారు. ఇలాంటి ఆపద వచ్చినప్పుడే, ఆ కుటుంబానికి ప్రతి ఒక్కరు అండగా నిలబడాలని చిరంజీవి పిలుపునిచ్చారు. ఈ బాధ నుంచి ఉత్తేజ్ కుటుంబ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

ఉత్తేజ్ సతీమణి పద్మావతి సంస్మరణ కార్యక్రమానికి చిరంజీవితో పాటు హీరో రాజశేఖర్, తనికెళ్ల భరణి, శ్రీకాంత్, రచయిత సుద్దాల అశోక్ తేజ, ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, నటి ఝాన్సి, హేమ తదితరులు హాజరయ్యారు. అంతా పద్మావతి ఫోటోకు నివాళులర్పించడంతో పాటు, ఉత్తేజ్ కు దైర్యం చెప్పారు.