ఏపీలో ప్రమాదకరమైన కరోనా వైరస్ వ్యాపిస్తోంది :చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ వ్యాపించిందని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సంచలనం రేపారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యాపించిన కొత్త వైరస్ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. రాష్ట్రంలో అత్యంత ప్రమాదకర కరోనా వైరస్ N 440 K వ్యాపించిందన్నారు. దీన్ని తొలిసారిగా కర్నూలులో సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారన్నారు.
ఏపీలో ప్రమాదకరమైన మ్యుటెంట్ స్ట్రెయిన్ వ్యాపిస్తోందా? అందుకే కేసుల సంఖ్య, మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయా? ఇదే ప్రచారం సోషల్ మీడియాలో కొన్ని గంటలుగా జరుగుతోంది. ఇప్పుడు అవే కామెంట్లను టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు చేయటంతో అందరూ ఉలిక్కిపడుతున్నారు. సాధారణ కరోనా వైరస్ కంటే ఏపీలో ప్రస్తుతం ఉన్న స్ట్రెయిన్ రకం 10 రెట్లు ప్రమాదకరమని చంద్రబాబుచెబుతుండటంతో టెన్షన్ పెరుగుతోంది.

రాష్ట్రంలో గోరంతను కొండంతలుగా చేసి ప్రచారం నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి సాక్షిలో ఫుల్ పేజీ యాడ్స్ కోసం రూ. వందల కోట్లు దుబారా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా బెడ్లు-ఆక్సిజన్ సరఫరా పెంచాలన్నారు. వైద్య సిబ్బంది కొరతను తీర్చడానికి నియామకాలు చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. సబ్బంహరి మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. నిస్వార్థ రాజకీయాలతో తనలాంటి వారికి మార్గదర్శకులుగా నిలిచారని లోకేశ్ పేర్కొన్నారు.