ఆయనను వెంటనే ఆఫీసుకు పిలవండి, లేదంటే.. భర్త బాస్ కు మహిళ లేఖ

స్పెషల్ డెస్క్- కరోనా మహమ్మారి అందరి జీవితాలను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా విధ్యార్ధులు, ఉద్యోగులపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. విధ్యార్ధులు కేవలం ఆన్ లైన్ క్లాసులకు మాత్రమే పరిమితం అయితే, చాలా వరకు ఐటీ ఉద్యోగులు వర్క ఫ్రం హోమ్ కు పరిమితం అయ్యారు. ఐతే వర్క్ ఫ్రం హోం కొంత మంది ఉద్యోగులకు రిలీఫ్ అనిపిస్తే, మరి కొంత మందికి మాత్రం ఇబ్బందులను కొనితెచ్చింది. ఓ భార్య తన భర్త పనిచేసే ఆఫీసుకు రాసిన లేఖ ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఈ విచిత్రమైన లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. తన భర్తకు ఇంతవరకూ కల్పించిన వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని వెంటనే రద్దు చేయాలని అతని భార్య డిమాండ్ చేసింది. ఈ ఉత్తరాన్ని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయంకా తన ట్విట్టర్ ఖాతాలో పంచుకోవడంతో, ఇప్పుడు అంతా ఈ లెెటర్ గురించే చర్చించుకుంటున్నారు.

letter 1

సదరు భార్య, తన భర్త పనిచేసే ఆఫీసరుకు రాసిన లెటర్ లో ఏం అందంటే.. నా భర్త.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండటంతో మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. ఇంకొన్ని రోజులు ఇదే కొనసాగితే నేను నా భర్త నుంచి విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. నా భర్త ఇంట్లో రోజుకు పది కప్పుల కాఫీ తాగుతాడు, ఇంట్లో ఈ గదిలోంచి ఆ గదిలోకి, ఆ గదిలోంచి ఈ గదిలోకి అనవసరంగా తిరుగుతుంటాడు. దీంతో నీట్ గా సర్దుకున్న ఇల్లంతా చెత్తమయం అవుతుంది.

ఇక అసలు విషయం ఏంటంటే.. నా భర్త పనిచేస్తున్న సమయంలోనూ నిద్రపోతుంటాడు. మాకు ఇద్దరు పిల్లలున్నారు, వారిని కూడా నా భర్త ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. నా భర్త రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్నాడు, కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ ఆఫీసుకు వచ్చేందుకు అర్హుడేనని.. ఆమె తన భర్త బాస్ కు రాసిన లెటర్ లో చెప్పుకొచ్చింది. ఈ ఉత్తరాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన హర్ష్ గోయంకా, ఆమె అసహనానికి ఏం సమాధానం ఇవ్వాలో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. ఆమె రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని ఓ నెటిజన్ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.