యాపిల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది

ఇంటర్నేషనల్ డెస్క్- యాపిల్.. ఈ కంపెనీ పేరు తెలియని వారుండరేమో. యాపిల్ కంపెనీ ఐఫోన్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాపిల్ ఐ ఫోన్ కలిగి ఉండటం ఓ స్టేటస్ సింబల్ లా భావిస్తారంటేనే ఈజీగా అర్ధం చేసుకోవచ్చు. అదిగో అలాంటి యాపిల్ కంపెనీ మరో రంగంలోకి అడుగుపెట్టి.. త్వరలోనే మన ముందుకు రాబోతోంది.

అవునుసెల్ఫ్ డ్రైవింగ్ సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకొచ్చేందుకు యాపిల్ కంపెనీ రంగం సిద్ధం చేసుకుంది. మరో నాలుగేళ్లలో ఈ వాహనాన్ని మార్కెట్లోకి తీసుకురావాలని యాపిల్ లక్ష్యంగా పెట్టుకుందని బ్లూమ్ బర్గ్ కథనం పేర్కొంది. సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ వాహనం తయారీ ప్రక్రియను యాపిల్ వేగవంతం చేసిందని, 2025 కల్లా ఈ వాహనం మార్కెట్లోకి రానుందని తెలుస్తోంది.

సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ వాహనం కోసం యాపిల్ ఓ సరికొత్త చిప్ ను తయారుచేస్తోందట. చిప్ రూపకల్పనను త్వరగా పూర్తి చేసి, అమెరికాలోని కాలిఫోర్నియాలో ఎలక్ట్రిక్ వాహనాాల పరీక్షలను మొదలుపెట్టాలని యాపిల్ యోచిస్తోంది. ప్రముఖ ఆటో దిగ్గజాలు టెస్లా, వేమో నుంచి అందుబాటులోకి రానున్న సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ వాహనాల కంటే యాపిల్ తీసుకువచ్చే ఎలక్ట్రిక్ వాహనం ఎంతో సామర్ధ్యంతో పనిచేయనుందని బ్లుమ్ బర్గ్ స్పష్టం చేసింది.

Apple Car 1

అన్నట్లు యాపిల్ కంపెనీ తన సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ వాహన తయారీ ప్రాజెక్టుకు టైటాన్ అని పేరు పెట్టింది. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారు స్టీరింగ్ వీల్, పెడల్స్ లేకుండా పూర్తిగా అటానమస్ గా ఉండనుందట. అంతే కాదు కారులో ఇంటీరియర్స్ కూడా చాలా లగ్జరీగా ఉండనున్నాయని తెలుస్తోంది. ఇక కానో సంస్థ తమ ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించాలని అనుకుంటున్న లిమోసిన్ స్టైల్ సీటింగ్ ను తమ ఎలక్ట్రిక్ వెహికిల్స్ లో ఏర్పాటు చేయాలని యాపిల్ భావిస్తోంది. యాపిల్ ఎలక్ట్రిక్ వాహనంలో ఐపాడ్ తరహా టచ్ స్క్రీన్ డిస్ప్లే, ఐఓఎస్ ఇంటర్ఫేస్ ఉండబోతోందట.

తమ ఎలక్ట్రిక్ వాహనానికి ప్రొప్రయిటరీ చార్జింగ్ కేబుల్ ను యాపిల్ తయారు చేయదని అంచనా. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో వాహనాన్ని చార్జ్ చేసుకునే వీలు ఉండేలా కంబైన్డ్ చార్జింగ్ సిస్టమ్ లేదా సీసీస్ స్టాండర్డ్ సదుపాయం ఉంచాలని భావిస్తోంది. టెస్లా కంపెనీ వేగాన్ని యాపిల్ అందుకోగలదా అని ఇప్పుడే చెప్పడం కష్టమంటున్నారు ఆటోరంగ నిపుణులు. ఎలక్ట్రిక్ వాహనం తీసుకొచ్చే అవకాశముందన్న సమాచారం బయటికి రాగానే యాపిల్ షేర్ ఏకంగా మూడు శాతం పెరిగడం గమనార్హం.